మండలిలో బలం పెంచుకునేందుకు కూటమి వ్యూహాలు.. ఆ నలుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందేలా స్కెచ్
టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, మద్దిపట్ల సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు.

Chandrababu Naidu
బంపర్ విక్టరీ కొట్టి ఏపీ అసెంబ్లీలో 164 సీట్లతో బలంగా ఉంది కూటమి సర్కార్. మొన్నటి వరకు రాజ్యసభలో కూడా పెద్దగా సభ్యులు లేకపోవడంతో వైసీపీ నుంచి పలువురిని చేర్చుకుని..రిజైన్ చేయించింది. వాళ్ల రాజీనామాలతో ఖాళీ అయిన సీట్లలో తమ పార్టీ నుంచి పలువురు నేతలను పెద్దల సభకు పంపించింది. ఇక మండలి మీద ఫోకస్ పెట్టింది కూటమి.
ఏపీ శాసన మండలిలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. దీంతో శాసన మండలిలో తమ సత్తా చాటేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యూహాలు రచిస్తూ వస్తోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించారు.
ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు చేశారు. వీళ్లు రాజీనామాలు చేసి నెలలు దాటుతున్నా మండలి ఛైర్మన్ ఇంతవరకూ ఆమోదించలేదు. మరోవైపు కూటమిలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతలు వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఎవరెవరి ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చారట. ఐదు సీట్లలో ఒకటి జనసేనకు ఇవ్వాబోతున్నారట.
బీజేపీ కూడా ఓ ఎమ్మెల్సీ సీటు అడుగుతుందా?
ఆ సీటులో నాగబాబు మండలికి వెళ్తారని అంటున్నారు. ఇక బీజేపీ కూడా ఓ ఎమ్మెల్సీ సీటు అడుగుతుందని చెబుతున్నారు. కమలం పార్టీకి ఇచ్చే సీటు రేసులో సోము వీర్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక టీడీపీకి మిగిలేది మూడు స్థానాలు మాత్రమే. కానీ సైకిల్ పార్టీలో పదుల సంఖ్యలో నేతలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
అందుకే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందేలా స్కెచ్ వేస్తోందట టీడీపీ. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు ఆమోదించేలా మండలి ఛైర్మన్‌పై ఒత్తిడి తేవాలని ఫిక్స్ అయిందట. అందుకోసం శాసనమండలి ఛైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోందట. దానికి వైసీపీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్సీలు కూడా మద్దతు ఇవ్వబోతున్నారట. అలా ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదింపజేసి తమ పార్టీలోని ఆశావహుల ఆశలు నెరవేర్చాలని అనుకుంటుందట టీడీపీ.
ఇక టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడుల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈలోగా కొత్త నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 20న పోలింగ్ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సంఖ్యాబలం బట్టి 5 సీట్లు కూటమి ఖాతాలోకే ఏకగ్రీవం కానున్నాయి.
చాన్స్ దక్కించుకునేందుకు టీడీపీ నేతల ప్రయత్నాలు
ఈ ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి దక్కనున్న మూడు సీట్లలో చాన్స్ దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోటా ఖాళీల్లో అవకాశం దక్కకపోయినా..వైసీపీ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాక అయినా తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు స్పీడప్ చేశారు ఆశావహులు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ విజ్ఞప్తులు వినిపించారు పలువురు నేతలు.
2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా, వివిధ కారణాలతో సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. నామినేటడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని చాలామంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
మాజీమంత్రులు జవహర్, దేవినేని ఉమా, పీఠాపురం టీడీపీ నేత వర్మ, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, నల్లపాటి రాము మండలికి వెళ్లాలని ఆశపడుతున్నారు. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై శాసనమండలిలో గట్టి పోరాటం చేసిన వారినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్ధావెంకన్న, అంగర రామ్మోహన్ ఉన్నారు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకుండా వీరు గట్టిగా నిలబడ్డారు.
ఇక ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావాహలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు రేసులో ఉన్నారు. దూదేకుల ముస్లిం కోటాలో అవకాశం కల్పించాలని నాగుల్ మీరా కోరుతున్నారు.
ఇక ఈ మధ్యే టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, మద్దిపట్ల సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే రామానాయుడులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. పీతల సుజాత పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇలా ఆశావహులు ఎక్కువగా ఉండటంతో..నలుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఫైనల్‌గా మండలి ఛైర్మన్ మీద అవిశ్వాసంతో ఆఖరి అస్త్రాన్ని వాడాలని ఫిక్స్ అయింది.