Kakani Govardhan Reddy : మాజీమంత్రి కాకాణికి ఏపీ హైకోర్టులో చుక్కెదురు..
కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను వాయిదా వేసింది కోర్టు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy : మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేము అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా కాకాణి అందుబాటులో లేరని తెలిపారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అదనపు సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశాన్ని మెమో రూపంలో దాఖలు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్టు.
మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని, అనుమతులు లేకుండానే పెద్దఎత్తున ఖనిజాలను తరలించారని మాజీ మంత్రి కాకాణిపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కాకాణి అందుబాటులో లేకుండా పోయారు. నోటీసులు కూడా తీసుకోవడానికి ఆయన అందుబాటులో లేరు.
Also Read : ఏపీలో త్వరలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఇవే.. సరికొత్త డిజైన్, ప్రత్యేకతలు ఏంటంటే..
దాంతో కాకాణి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాను హైదరాబాద్ లో ఉన్నానని, కుటుంబసభ్యులతో కలిసి ఉగాది పండగ చేసుకుంటున్నట్లు కాకాణి సోషల్ మీడియాలో చెప్పడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసులు ఇవ్వాలని చూశారు. అక్కడ కూడా కాకాణి లేకపోవడంతో ఆయన సమీప బంధువుకి నోటీసులు అందజేశారు పోలీసులు.
దీంతో కాకాణి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తో పాటు తన మీద నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.