Pawan Kalyan : రుషికొండపై భవనాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. కరెంట్ బిల్లే రూ. 15లక్షలు..
విశాఖలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు.

Pawan Kalyan
Pawan Kalyan : విశాఖలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, జనసేన ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి భవన సముదాయంలో నిర్మాణాలు, సదుపాయాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాల నిర్మాణం, అందులోని సదుపాయాలకోసం వెచ్చించిన ఖర్చులను మంత్రులు పవన్ కల్యాణ్ కు వివరించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ భవనాల నిర్మాణంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రుషికొండపై భవనాలకోసం భారీగా ఖర్చు చేశారు. రూ.450 కోట్లతో నాలుగు బ్లాక్‌లు కట్టడానికి ఖర్చు చేశారు. గతంలో మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. ఎన్నో అడ్డంకులు సృష్టించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి సుమారు 7కోట్లు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం ప్యాలెస్ కు కేవలం కరెంట్ బిల్లు సంవత్సరానికి 15లక్షలు అవుతుంది. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. లోపల పెచ్చులు ఊడిపోతున్నాయి.. కొన్ని చోట్ల లీకేజ్ అవుతుందని పవన్ తెలిపారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉండటానికి ఈ భవనాలు నిర్మించారు. కానీ, కూటమి ప్రభుత్వం రుషికొండ భవనాలను టూరిజం కింద ఎలా ఉపయోగించాలన్నదానిపై ఆలోచిస్తుంది. మేజర్‌గా ఈ భవనాలను ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నాం. ఈ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. ప్రస్తుతం పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు.