Pawan Kalyan: నేను మీ సతీమణి భారతీ మేడమ్ గురించి మాట్లాడానా జగన్?: పవన్ కల్యాణ్
వాలంటీర్ లు ముందుగా రెక్కీలు నిర్వహిస్తున్నారని, ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు అందవని బెదిరిస్తున్నారని పవన్ చెప్పారు.

Pawan Kalyan
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లపై జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari district) తాడేపల్లిగూడెంలో వారాహి సభలో పవన్ మాట్లాడారు.
సీఎం గారూ నమస్తే, నేను పవన్ కల్యాణ్ ని అంటూ ప్రసంగం ప్రారంభించారు జనసేనాని. ఆడపడుచుల భద్రత, కార్మికుల, నిరుద్యోగుల భద్రత గురించి మాత్రమే నేను ఇంతకాలం మాట్లాడానని తెలిపారు. ” కానీ, అతను, అతని మద్దతుదారులు నీచంగా మాట్లాడుతున్నారు. ఒకసారైనా నేను మీ సతీమణి భారతీ మేడమ్ గురించి మాట్లాడానా? కావాలంటే మేడమ్ ను అడగండి, నేనెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయను.
జగన్.. నువ్వు ముఖ్యమంత్రి పదవికి తగవు, సంస్కార హీనుడివి. పెళ్లాం అని మాట్లాడుతున్న జగన్, నీకు సంస్కారం లేదు. రాష్ట్రంలో కొందరు వాలంటీర్లు అత్యాచారాలు, స్మగ్లింగ్, రౌడీయిజం చేస్తున్నారు. అలాంటి వాలంటీర్లకు నువ్ ఎలాంటి బాధ్యత వహిస్తావ్.
వాలంటీర్ లు ముందుగా రెక్కీలు చేస్తున్నారు, ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు అందవని బెదిరిస్తున్నారు. గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా వాలంటీర్ల కింద ఆడపిల్లలు నలిగిపోతున్నారు. నేరం చేస్తున్న వాలంటీర్లకు జగన్ జైలుకెళ్లి వచ్చిన వారసత్వం అంటింది. నిజమైన వాలంటీర్ కు రూ.5 వేలకు మరో రూ.5 వేలు వేసి రూ.10 వేలు ఇచ్చే మనస్తత్వం నాది. రూ.164.38 పైసలు రోజుకి వాలంటీర్ కు ఇచ్చి ఊడిగం చేస్తున్నారు.
ఏపీలో ఆంధ్ర గోల్డ్ విస్కీ రూ.130 లు, బూమ్ బూమ్ రూ.200 ఉన్నాయి. వాలంటీర్ జీతం బూమ్ బూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ విస్కీకి ఎక్కువ. జనవాణి అనే కార్యక్రమం ప్రారంభం అవడానికి వైసీపీ వాలంటీర్ కారణం ” అని చెప్పారు.
వాలంటీర్ల గురించి నేను తప్పు పట్టలేదు. జస్టిస్ దేవానంద్ తప్పుబట్టారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, ప్రజా సమాచారం సేకరించడానికి అర్హులు కాదు అని జస్టిస్ తెలిపారు. ప్రజల డేటా చోరీ అయితే బాధ్యత ఎవరు వహిస్తారని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు.
ఏపీలో కేవలం రూ.5 వేలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నానక్ రామ్ గూడా లోని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీ దగ్గర ఏపీ ప్రజల డేటా ఎందుకు పెట్టావో జగన్ సమాధానం చెప్పాలి. చెత్త ప్రభుత్వాన్ని నడుపుతున్న చెత్త ముఖ్యమంత్రి జగన్ ” అని పవన్ అన్నారు.
జగన్ గురించి అయోగ్యుడు అనే పుస్తకం రాయాలని పిలుపునిచ్చారు పవన్. దానికి ముందు మాట తాను రాస్తానని చెప్పారు. ” భవన కార్మికుల సంక్షేమ నిధి రూ.669 కోట్లు పక్కదారి పట్టించావ్ జగన్. రాష్ట్రంలో 33 వేల క్లయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ముస్లిం మైనారిటీ లకు కేటాయించిన బడ్జెట్ లో 7 శాతం మాత్రమే జగన్ ఖర్చు పెట్టాడు. బీజేపీతో నేను ఉన్నానా, లేదా అని అనవసరం, మీకు న్యాయం చేస్తానా లేదా అని మైనార్టీలు ఆలోచించండి.
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల పొట్ట కొట్టి నిధులు మళ్లించావ్ జగన్. 2021-22 బడ్జెట్ లో బీసీ లకు కేటాయించిన నిధులు కూడా మళ్లించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలంటే జనసేన అధికారంలోకి రావాల్సిందే. మద్య నిషేధం అనేది సాధ్యం కానిది.
జనసేన అధికారం లోకి వస్తే, మహిళలు కోరుకున్న చోట మద్యం నిషేధిస్తాం.నివాసాలు, విద్యాలయాలు సమీపంలో మద్యపానం నిషేధిస్తాం. స్వచ్ఛమైన మద్యాన్ని పాత ధరలకే ఇస్తాం. లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది తెచ్చేలా ఉంటే ఊరుకోం. తాడేపల్లిగూడెంలో రోడ్డు మీద వస్తుంటే పడవలో వెళ్తున్నట్లుంది” అని పవన్ విమర్శించారు.