లాక్‌డౌన్ పొడిగింపుపై జగన్ చెప్పిందే మోడీ చేస్తున్నారా?

లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే దేశాన్ని మూడు జోన్లగా విభజించనున్నట్టు ప్రకటించారా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగించి.. కరోనా కేసులు తక్కువ లేదా అసలే లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలనే జగన్ ప్రతిపాదనను మోడీ స్వాగతించారా? అంటే ప్రస్తుత కేంద్ర నిర్ణయాన్ని పరిశీలిస్తే అలానే అనిపిస్తోంది. ఏది ఏమైనా లాక్ డౌన్ పొడిగింపు మాత్రం తథ్యమేనని చెప్పవచ్చు. కానీ, కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన :
లాక్ డౌన్ పొడిగించాలని ఇతర రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మాత్రం.. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ విధించాలని ప్రతిపాదించారు. కరోనా కేసులు స్వల్పంగా ఉన్న ప్రాంతాల్లో సడలింపుతో లాక్ డౌన్ కొనసాగాలని అన్నారు. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కొనసాగించాలని.. అసలు కరోనా కేసులే నమోదు కాని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని జగన్ సూచించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, చివరకు జగన్ సూచించిన ప్రతిపాదననే ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇలా చేయడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోవడం, రాష్ట్రాల్లోనూ ఆర్థికపరంగా ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ అమల్లో ఉండేలా చూడాలన్నది జగన్ ప్రతిపాదించారు. కానీ, జగన్ ప్రతిపాదనపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేసే ప్రసక్తే లేదని, మరో రెండు వారాల పాటు పొడిగించాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదించాయి.
ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తారా? :
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 14 (మంగళవారం) తొలి విడత ముగియనుంది. రెండో విడత లాక్ డౌన్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది. వైరస్ ఉధృతిని బట్టి వివిధ ప్రాంతాలను వేర్వేరు రంగులతో గుర్తించాలని నిర్ణయించింది.
400 జిల్లాల్లో పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేత? :
వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లగా గుర్తించనుంది. 15 కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించనుంది. కరోనా ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది. జోన్ల వారీగా దేశంలో లాక్ డౌన్ పై కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలిచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం లేని 400 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలోకి రానున్నాయి. మళ్లీ కొత్త జోన్లు నమోదు కాకుంటే ఆరెంజ్ జోన్ లోనే జిల్లా ఉంటాయి.
పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగానే కనిపిస్తోంది. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదని.. లాక్ డౌన్ సమయాన్ని మరో రెండు వారాల పాటు పొడిగించాలంటూ రాష్ర ప్రభుత్వాలు ప్రధానికి మోడీకి సూచించాయి. భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల మేరకు కేంద్రం దేశాన్ని మూడు జోన్లగా విభజించాలని నిర్ణయానికి వచ్చింది.
మూడు జోన్లుగా విభజించాలని నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ప్రధాని మోడీ.. దేశాన్ని మూడు జోన్లగా విభజించాలని నిర్ణయించారు. అందులో కరోనా ప్రభావిత ప్రాంతాలను బట్టి లాక్ డౌన్ ఉంచాలా? ఎత్తివేయాలా? అనేది నిర్ణయంచనున్నారు. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రమే లాక్ డౌన్ కొనసాగించి కరోనా లేని ప్రాంతాల్లో గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా కనిపిస్తోంది. శనివారం 13రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్షరెన్స్ తర్వాత లాక్ డౌన్ పొడిగించునన్నట్టు మోడీ ఇండికేషన్ ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సడలింపులు ఉంటాయని, ఆర్థికవ్యవస్థ కోలుకోవడం కోసం కొన్నిచోట్ల మినహాయింపులు ఉండవచ్చని సూచించారు.
గ్రీన్,ఆరెంజ్ జోన్లలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పరిమిత స్థాయిలో ప్రారంభించడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుమతించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినట్టుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మరో రెండు వారాల (ఏప్రిల్ 30) వరకు పొడిగిస్తుందా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి సడలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉందో తెలియాలంటే కేంద్రం నుంచి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించేవరకు ఆగాల్సిందే.