YS Viveka case: వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు.. అందుకే వారందరూ కలిసి ఇలా చేస్తున్నారు: సజ్జల
YS Viveka case: వివేక మృతి కేసులో సజ్జల పలు ప్రశ్నలు వేశారు. ఇలా ఎందుకు జరుగుతోందని నిలదీశారు.

Sajjala Ramakrishna Reddy
YS Viveka case: వివేకా మృతి కేసు విచారణ కోఆర్డినేటెడ్‌గా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. అమరావతిలో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వివేక కేసును (YS Viveka case) వచ్చే ఎన్నికలకు ప్రధాన పొలిటికల్ అజెండాగా తీసుకుని వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. దస్తగిరి అనే ప్రధాన నిందితుడు సవాల్ విసరడం వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు.
“హత్య ఎంత క్రూరంగా చేశాడో చెప్పిన వ్యక్తి దస్తగిరి.. అలాంటి వ్యక్తితో ప్రాణభయం ఉందని మాట్లాడిస్తున్నారు. అసలు దస్తగిరి బయట ఎందుకు తిరుగుతున్నాడు? బెయిల్ ఎందుకు వచ్చింది? అవినాశ్ హత్య చేశారని, దాని వెనుక జగన్ ఉన్నారని అని చిత్రీకరించడానికి కుట్ర పన్నారు. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదు.
ఇన్వెస్టిగేషన్ పేరుతో పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఏకపక్షంగా విచారణ చేస్తున్నారని రామ్ సింగ్ టీమ్ ను సుప్రీంకోర్టు తప్పిస్తే.. కొత్త టీమ్ అదే పని చేస్తుంది. రామ్ సింగ్ చెయ్యాలి అనుకున్న పనిని వీళ్లు పూర్తి చెయ్యడానికి వచ్చినట్టు ఉంది. సుప్రీంకోర్టు టీమ్ మార్చింది అంటే అర్థం ఏంటి? ఏకపక్షంగా జరుగుతుంది అనేగా? అవినాశ్ రెడ్డి వైపు వాళ్లనే కేసులో ఇరికించాలని చూస్తున్నారు తప్ప.. అవతల వైపు దర్యాప్తు జరగడం లేదు.
రంగన్న అనే వాచ్‌మన్ నలుగురిని చూశానని చెబుతున్నాడు. ప్రత్యక్ష సాక్షి రంగన్న ఉన్నప్పుడు అప్రూవర్ తో పనేంటి? దస్తగిరిని అప్రూవర్ గా ఎందుకు మార్చారు? ఎవరిని ఇరికించాలని మార్చారు? కడప ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మాకు క్లియర్ మెజారిటీ ఉన్నా టీడీపీ పోటీ పెట్టింది.
ఆ ఎన్నికల్లో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి కలిసి వివేకాను అక్రమంగా ఓడించారు. వివేకాకు కోపం ఉంటే వాళ్లిద్దరిపై ఉంటుంది. ఆదినారాయణ రెడ్డిని వివేకా కుమార్తె సునీత ఎందుకు కలవాల్సి వచ్చింది? అవినాశ్ కు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు వివేకా వైసీపీలో లేరు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
YS Viveka Case: ఏపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట