Viveka Case Update: అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సునీత.. హైకోర్టులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌కు చుక్కెదురు
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Avinash Reddy, Sunitha
Viveka Case Update: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డి ని అరెస్టు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించిన విషయం విధితమే. విచారణ అనంతరం ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఆయన సీబీఐ విచారణకు అప్పటి వరకు హాజరుకావాలని కోర్టు సూచించింది. బుధవారం సీబీఐ అవినాశ్ ను విచారించగా.. గురువారం రెండోరోజు అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. 25న అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సునీత పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈరోజు సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. విచారణకు స్వీకరిస్తామని సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్‌కోసం తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించగా, ఈనెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సునీత సవాలు చేసింది.
మరోవైపు చలచల్ గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డి, ఉయద్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు రెండోరోజూ విచారించారు. అయితే, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. అయితే, హైకోర్టులో వారికి చుక్కెదురైంది. ఇద్దరి బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. భాస్కర్ రెడ్డి, అవినాశ్ ను లాయర్ల సమక్షంలో విచారించాలని ఆదేశించిన హైకోర్టు, భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దృష్ట్యా జైల్ లో సరైన వైద్యం అందించాలని హైకోర్టు సూచించింది.