రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీని నాయకత్వ లోపం వెంటాడుతోంది. దశాబ్ద కాలంగా టీడీపీ జెండా రెపరెపలాడిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారు. సామాజిక, ఆర్దిక, వ్యక్తిగత బలాలతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తోట త్రిమూర్తులు ఇటీవల వైసీపీలో చేరడంతో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందని అంటున్నారు.
పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో తన తర్వాత నెంబర్ 2 లేకుండా తోట త్రిమూర్తులు జాగ్రత్త పడటం, తోట మీద అతి నమ్మకంతో అధిష్టానం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాయకత్వ లేమి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందట.
10 నెలలు అవుతున్నా, నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించ లేకపోయింది:
తోట త్రిమూర్తులు టీడీపీని వీడి దాదాపు 10 నెలలు అయినా ఇంతవరకు నియోజకవర్గ ఇన్‌చార్జిని పార్టీ అధిష్టానం నియమించలేకపోయింది. ఉన్న నాయకుడు పార్టీని వీడటం, తోటకు ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించకపోవడంతో కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారట. శెట్టి బలిజ వెర్సస్ కాపు వర్గాలుగా రాజకీయాలు సాగే రామచంద్రాపురంలో టీడీపీ అధిష్టానం మొదటి నుంచి తోటకు మంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. తోట కాపు సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో ఆయనకు పోటీగా శెట్టి బలిజ సామాజికవర్గం నుంచి ఎవరూ ముందుకు రాలేకపోయే వారట.
కాపు సామాజికవర్గంలో నెంబర్ 2 లేరు:
వైసీపీలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందినవారు కావడం, వారిద్దరికీ వైసీపీలో మంచి ప్రాధాన్యం ఉండటంతో వారంతా వైసీపీ వెంట నడిచారు. దీనికి తోడు పార్టీలో తనకు ప్రత్యామ్నాయం లేకుండా తోట త్రిమూర్తులు ముందు నుంచి జాగ్రత్త పడటంతో కాపు సామాజికవర్గం నుంచి కూడా నెంబర్ 2 ఎవరూ లేరట. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన తర్వాత రామచంద్రాపురం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
ఆ ముగ్గురిని ఎదురించే ధైర్యం ఎవరికీ లేదు:
వైసీపీ అధిష్టానం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపించగా చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణను కేబినెట్ లో స్థానం కల్పించింది. ఇక ఇటీవల పార్టీలో చేరిన తోట త్రిమూర్తులుకు అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంతో వారి ముగ్గురిని ఎదురించి, టీడీపీ వైపున నిలబడటానికి ఎవరూ ముందుకు రావడం లేదట. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే వైసీపీలో చేరిపోవడం, తోట వెంట ఉన్న కాపు నేతలు ఆయన వెంట వెళ్లిపోవడంతో తెలుగు తమ్ముళ్లకు దిక్కు తోచడం లేదంటున్నారు.
నియోజకవర్గంలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే:
నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రతిపాదించడానికి కూడా స్థానిక నాయకుల పేర్లు కనిపించని స్థితిలోకి టీడీపీ దిగజారిపోయిందని కేడర్‌లో చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాల మాట ఎలాగున్నా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరూ పాల్గొనడం లేదని చెబుతున్నారు. అధిష్టానం ఒత్తిడితో ఎవరైనా ముందుకు వచ్చినా ఎన్ని రోజులు ఉంటారనేది అనుమానమే. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనని గుసగుసలాడుకుంటున్నారు.
గుర్రుగా ఉన్న శెట్టిబలిజ, ఎస్సీ సామాజికవర్గం నాయకులు:
తోట త్రిమూర్తులు పార్టీలో చేరడంపై పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు ఏమనుకున్నా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారట. తోట త్రిమూర్తులు పదేళ్ల హయాంలో రాజకీయ వేధింపులకు గురయిన శెట్టిబలిజ, ఎస్సీ సామాజికవర్గం నాయకులు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట. వైసీపీలో అసంతృప్తులను కలుపుకొని టీడీపీని బలోపేతం చేసే నాయకుడి కోసం అధిష్టానం వెతుకులాట ప్రారంభించిందట. నియోజకవర్గంలో అలాంటి నాయకుడు కనిపించకపోవడంతో కొత్తపేట నుంచి దిగుమతి చేసుకోవడానికి అధిష్టానం సిద్ధమవుతోందని టాక్.
రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రాపురం ఇన్‌చార్జిగా నియమించాలనే ఆలోచనలో టీడీపీ:
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రాపురం ఇన్‌చార్జిగా నియమించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందని అంటున్నారు. శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన ఆయన అయితే ఎంతో కొంత పార్టీకి ఉపయోగ పడుతుందనే ఆలోచనలో టీడీపీ పెద్దలున్నారు. ఈ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుంది? రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అన్నది చూడాల్సిందే.