YV Subba Reddy : వారికి.. శ్రీవారే శిక్ష విధిస్తాడు.. దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు..

Tirumala
YV Subba Reddy : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ధనవంతుల ప్రయోజనాలు పరిరక్షించే కుట్రతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు చెప్పామా? అని ఆయన నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మరని అన్నారు. స్వామివారి సేవా టికెట్ల జారీలో వీఐపీల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే, ఆ చర్చను వక్రీకరించి కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దౌర్భాగ్యం అని వాపోయారు.
పాలక మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే ఎస్వీబీసీ లో లైవ్ ఇస్తున్నాం అని తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా చర్చించ లేదని ఆయన తేల్చి చెప్పారు. సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదని చెప్పిన మాటలు విమర్శకుల చెవులకు వినిపించక పోవడం తమ తప్పుకాదన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని చేస్తున్న తప్పుడు ప్రచారాలను శ్రీ వేంకటేశ్వర స్వామి సఫలం కానివ్వరని అన్నారు.
TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు టీటీడీ ఎట్టిపరిస్థితుల్లో తీసుకోదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పాలకమండలి సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ వాస్తవం…
”ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. సేవా టికెట్లు పరిమితంగా ఉండగా, సిఫారసు లేఖలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. సిఫారసులను తగ్గించేందుకు విచక్షణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధరలను పెంచితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ మాత్రమే జరిగింది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సామాన్యులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచాలనే ఆలోచనే లేదు.
వీఐపీల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే దుష్ప్రచారం చేస్తున్నారు. రెండున్నరేళ్ల నుండి టీటీడీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున హిందూ ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి విడతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించాం. రెండో విడతగా 1100 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం
జీవిత కాలంలో ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోలేని పేద వర్గాలను ఆహ్వానించి ఉచితంగా శ్రీవారి దర్శనం చేయిస్తున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2021 అక్టోబర్ 7 నుండి 14వ తేదీ వరకు 7వేల 500 మందికి బ్రహ్మోత్సవ దర్శన భాగ్యం కల్పించాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుండి 20 వరకు 7 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాం” అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కాగా, సిఫార్సు లేఖలపై వచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంపుపై పాలకమండలిలో చర్చించగా.. కొందరు వీడియోను కట్ చేసి మొత్తం ఆర్జితా సేవా టికెట్ల ధరల పెంపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వీడియోను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.