పోటీకి సిద్ధం అంటున్న కృష్ణంరాజు.. ప్రభాస్ క్రేజ్‌తో గెలుస్తారా?

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 06:08 AM IST
పోటీకి సిద్ధం అంటున్న కృష్ణంరాజు.. ప్రభాస్ క్రేజ్‌తో గెలుస్తారా?

Updated On : March 11, 2019 / 6:08 AM IST

తెలుగునాట రాజకీయాలలో సినిమావాళ్లు పోటీ చేయడం కొత్తేం కాదు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినిమా వాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలనాటి స్టార్ హీరో కృష్ణం రాజు సిద్దం అంటూ ప్రరకటించారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, సోమవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన తెలిపారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికవ్వడం ఖాయమన్నారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని, గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునారావృత్తం అవుతాయని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గతకొంతకాలంగా కృష్ణం రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తుండగా వాటికి చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీకే సిద్దమైనట్లు ఆయన ప్రకటించారు. కాగా కృష్ణంరాజు గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి హయాంలో పని చేశారు. 2004 తర్వాత కూడా ఆయన బిజెపిలో కొనసాగారు.

అయితే 2008లో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నుండి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు నటులు ఓడిపోయి, ఉండవల్లి గెలుపొందారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో కృష్ణం రాజు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. తర్వాతి కాలంలో మళ్లీ బీజేపీ గూటికే చేరారు. 

ప్రస్తుతం బీజేపీ పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగ‌జారిపోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కృష్ణంరాజు పోటీ చేస్తారా.. లేదా అనే దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో కాకినాడ నుంచి ఒక‌సారి.. న‌ర్సాపురం నుంచి మ‌రోసారి బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందిన కృష్ణం రాజు 2019 ఎన్నిక‌ల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ రిత్యా.. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో విజయావకాశాలు ఎక్కువ అని బీజేపీ భావిస్తుంది. అయితే కృష్ణంరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.