టీడీపీ, జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి రాళ్లు రువ్వారు: అంబటి రాంబాబు
వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని కారుపై కొందరు దాడి చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇవాళ గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ, జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి రాళ్లు రువ్వారని ఆరోపించారు.
ఇప్పటి వరకూ పోలీసులు చర్యలు చేపట్టలేదని, ఎస్పీకి బొత్స సత్యనారాయణ ఫోన్ చేశారని అంబటి రాంబాబు తెలిపారు. తాను ఫోన్ చేసినప్పటికీ ఎస్పీ ఫోన్ తీయలేదని, ఏపీలో శాంతి భద్రతలు లేవని చెప్పారు. మాజీ మంత్రిని తిరగటానికి వీళ్లేదని అనటం ఏంటని నిలదీశారు.
ఇంటూరు రవి కిరణ్ ఎన్నికల ముందు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతన్ని న్యాయవాదుల సాయంతో పేర్ని నాని పీఎస్ నుండి బయటకు తీసుకొచ్చారని అంబటి రాంబాబు తెలిపారు. ఏపీలో అమలు అవుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగం కాక మరేంటని అడిగారు.
పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైతే ఏపీలో అరాచకత్వం ప్రబలుతుందని అంబటి రాంబాబు చెప్పారు. పోలీసులు రక్షణ కల్పించకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు.
తప్పుడు కేసులు పెడుతూనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు, లోకేశ్ పరిధిలో విద్యాశాఖ ఉందని, ట్రిపుల్ ఐటీ కాలేజ్, గుడ్లవల్లేరు కాలేజీల్లో జరిగిన ఘటనల్లో న్యాయం చేయడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు.
Also Read: జలదిగ్బంధంలో విజయవాడ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం