YSRCP నిర్లక్ష్యమే TDPకి బలంగా మారుతుందా!?

గతేడాది ముగిసిన సాధారణ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొంది వైసీపీ. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 151 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 22 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాలు వంటివి అమలు చేయడంలో వైసీపీ చురుగ్గా ఉంది. వాస్తవానికి ఓటు బ్యాంకు ఎక్కడ ఉందో అక్కడ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు సీఎం జగన్.
కానీ, మూడు రాజధానుల అంశం కొంత ఇబ్బందిగా మారింది. దీనిపై జరుగుతోన్న పోరాటం రోజు రోజుకూ పెరుగుతోంది. దీన్ని టీడీపీ రెండు చేతులతో అందిపుచ్చుకుందని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన అనుభవానికి మరో రెండు మూడేళ్ల పాటు కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. ఏడాది వరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదనే నిర్ణయానికి స్వయంగా ఆ పార్టీయే వచ్చేసింది కూడా.
ప్రజల నుంచి ఎన్నికల్లో అంత వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితుల్లో అధికార పార్టీపై విమర్శలు చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత మూటగట్టుకోవలసి వస్తుందని భావించింది. అనుకోని రీతిలో మూడు రాజధానుల ప్రకటన రావడం, దీనిపై రైతులు ఉద్యమానికి దిగడంతో టీడీపీలో ఊపొచ్చింది. ఆరంభంలో కొన్ని గ్రామాలకే పరిమితమైన ఉద్యమం తర్వాత అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీ ఏర్పాటు కావడంతో మరింత ఊపందుకుంది. ఉద్యమానికి వస్తోన్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ దీన్ని సొంతం చేసుకుందని అంటున్నారు.
జేఏసీ నేతలు బస్సుల ద్వారా రాష్ర్టంలో తిరగాలని నిర్ణయిస్తే, దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బస్సుల దగ్గరకు చంద్రబాబు వెళ్లబోతే ఆయనను అడ్డుకొని, అరెస్టు చేసి మరీ హడావుడి చేశారు. దీంతో చంద్రబాబు జాతీయ మీడియాకి ఎక్కారు. తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా జవసత్వాలు వచ్చాయి. దీన్ని గమనించిన టీడీపీ, చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాను చేసుకున్నారని అంటున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమానికి సారథ్యం వహించారు. ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి వ్యూహం లేకపోవడం దెబ్బతీసింది.
అమరావతి పరిరక్షణ పేరుతో సాగే ఉద్యమాలపై ప్రభుత్వం ఆరంభం నుంచీ అణచివేత ధోరణే ప్రదర్శిస్తోంది. మూడు రాజధానులు వద్దని ఉద్యమాలు సాగుతుంటే, కావాలంటూ వైసీపీ ఉద్యమాలు చేయించింది. ఇది ప్రజలకు కూడా తెలిసిపోయింది. జేఏసీ ఉద్యమాలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఇచ్చినా పోలీసులు అణచివేయడం వంటివి వైసీపీకి తీరని నష్టం కల్గించాయని చెబుతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, జేఏసీ నేతలపై కేసులు నమోదు చేయడం వైసీపీకి నష్టదాయకంగానే మారాయంటున్నారు.
చంద్రబాబు విశాఖపట్నంలో చేయబోయిన పర్యటన, అరెస్టు వంటివి కూడా టీడీపీకి మంచి మైలేజీని తీసుకొచ్చాయి. ఈ విషయంలో వైసీపీ వెనుకబడిపోయిందనే చెప్పాలి. జేఏసీ నేతలు, రైతులు, చంద్రబాబు.. ఇలా ఎవరు సభలు పెట్టుకున్నా.. నిరసన ప్రదర్శనలు చేసినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించి ఉంటే ఉద్యమం ఇన్ని రోజులు జరిగేది కాదనే అభిప్రాయం ఉంది. టీడీపీ కూడా ఇప్పట్లో కోలుకునేది కాదనే వాదన వినిపిస్తోంది.
ఇందుకు భిన్నంగా సాగడంతో ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత, టీడీపీ పట్ల సానుభూతి పెరిగిందన్నది వాస్తవం. ఈ విషయాన్ని అంచనా వేయడంలో వైసీపీ నేతలు, ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వెనుకంజలోనే ఉన్నాయని అంటున్నారు. తమ చేజారిపోతుందని భావించిన టీడీపీ కేడర్ అలాగే నిలబడింది. దీంతో అనుకున్న దానికంటే ముందుగానే టీడీపీ కోలుకుందనే ఆనందం చంద్రబాబులో ఉందని చెబుతున్నారు. బాబు వ్యూహాన్ని అంచనా వేయడంలో వైసీపీ విఫలం అయిందని జనాలు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంత తొందరగా టీడీపీ పుంజుకోవడానికి వైసీపీయే పరోక్షంగా సహకరించినట్టు అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.