Pm Modi To AP : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌‌కు తోడుగా రంగంలోకి ప్రధాని మోదీ

ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ..

Pm Modi To AP : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌‌కు తోడుగా రంగంలోకి ప్రధాని మోదీ

Updated On : April 18, 2024 / 9:17 PM IST

Pm Modi To AP : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి దూకుడు పెంచుతోంది. కూటమి ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేయనున్నారు.

గత నెల చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ.. మరోసారి ఎన్డీయే కూటమి తరపున 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట, మరో ప్రాంతంలో నిర్వహించే సభలకు ప్రధాని మోదీ హాజరవుతారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారం విషయంలో ఎన్డీయే కూటమి స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీతో గత నెలలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తాజాగా మరో నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధాని కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్టీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధాని బహిరంగ సభల కోసం అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని చంద్రబాబు వారితో చెప్పినట్లు సమాచారం. బీజేపీ పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట లేదా కడపలో మూడు సభలు ఖాయమయ్యాయి. మరో ప్రదేశం ఏది అన్నది ఖరారు కాలేదు.

ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటనలు చేయాలని చంద్రబాబు, పవన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా నిడదవోలులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ప్రచారం చేశారు. ఇంకా కొందరు బీజేపీ జాతీయ నాయకులతో కలిసి చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.

ప్రధాని మోదీ పాల్గొనబోయే మూడు సభలను ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటిని సక్సెస్ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి బీజేపీ ఏ విధమైన భరోసా కల్పిస్తుంది అనే దానిపై ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని టీడీపీ, జనసేన నేతలు యోచిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నాం? అనేది రానున్న బహిరంగ సభల్లో చెప్పబోతున్నారు.

Also Read : ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, గెలుపు ఖాయమైపోయింది- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో మంత్రి అంబటి రాంబాబు