బిల్డింగ్ కూలి 10మంది మృతి…శిథిలాల కింద మరికొందరు

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని మొహమ్మదాబాద్‌లోని ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనం శిథిలాల కింద ఇంకా కొంతమంది ఇరుకున్నట్లు సమాచారం. శిథిలాలు తొలగించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన మెడికల్ హెల్ప్,అన్ని రకాల సాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారని అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోం) అవనీష్ అవస్తి తెలిపారు.