ట్రంప్ పర్యటనకు గంటల ముందు : ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళనలు..పోలీస్ ఆఫీసర్ మృతి

దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మళ్లీ హింస చెలరేగింది. రెండవ రోజు కూడా ఢిల్లీ భగ్గుమన్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా, మౌజ్‌పుర్, జఫ్రాబాద్ ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి. సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది.
రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. వందలాది షాపులు,వాహనాలు తగులబెట్టారు. అయితే ఈ అల్లర్లలో ఓ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. డీసీపీకి గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ సాయంత్రం ఢిల్లీలో అడుగుపెట్టనున్న సమయంలో సీఏఏ అలర్లలో ఓ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఆదివారం జఫ్రాబాద్ వద్ద రాళ్లు రువ్విన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా అక్కడ సుమారు వెయ్యి మంది మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీలో సీఏఏకు మద్దతుగా స్థానిక బీజేపీ నాయకుడు నేతృత్వంలో ఓ వర్గం మౌజ్‌పూర్‌లో ర్యాలీ తీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు రాళ్లురువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అనంతరం ప్రదర్శకులపై లాఠీచార్జి జరిపారు.
24గంటలు గడువక ముందే ఇవాళ మరోసారి హింసాత్మక ఘటనలు జరగడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో శాంతియుత వాతావరణం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుత్సాహకర వాతావరణం నెలకొన్నదన్నారు. నగరంలో శాంతి నెలకొనే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కేజ్రీవాల్ కోరారు.