జల్సాలకు అలవాటు పడి బస్సు చోరీ చేశారు

  • Published By: chvmurthy ,Published On : April 27, 2019 / 10:33 AM IST
జల్సాలకు అలవాటు పడి బస్సు చోరీ చేశారు

Updated On : April 27, 2019 / 10:33 AM IST

హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడిన పాతనేరస్ధులే ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి 9 మంది పై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీలో ఆటో నడుపుకునే ఇద్దరు అన్నదమ్ములు ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఆయన తెలిపారు. గతంలో దుబాయ్ లో హెవీ వెహికల్ డ్రయివర్ గా పని చేసిన వచ్చిన వ్యక్తి బస్సును దొంగిలించి తీసుకు వెళ్ళాడని డీసీపీ వివరించారు.  హైదరాబాద్ లో సెల్ ఫోన్ చోరీ కేసులు ఇంటి దొంగతనాలు చేసి జల్సాలకు అలవాటు పడిన అన్నదమ్ములు నాందేడ్ లో  పాత ఇనుము తుక్కు వ్యాపారం చేసుకునే తమ బంధువుతో డీలు కుదుర్చుకుని ఆర్టీసీ బస్సును చోరీ చేసి తీసుకువెళ్లారు.

కుషాయిగూడ డిపోకు చెందిన  ఏపీ11జడ్‌ 6254  బస్సు  హైదరాబాద్‌లోని సీబీఎస్ బస్ స్టాప్‌లో నిలిపి ఉంచగా ఏప్రిల్  23వ తేదీ రాత్రి చోరీ అయిన సంగతి తెలిసిందే.  కేసు నమోదు చేసుకున్న పోలీసుల 4 టీములను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆ బస్సు తూప్రాన్ టోల్‌గేట్ దాటినట్టు సీసీటీవి ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు బస్సు నాందేడ్ వైపుగా వెళ్తున్నట్టు గుర్తించారు. టోల్ గేట్ సిబ్బంది చెప్పిన క్లూ ప్రకారం హైదరాబాద్ పోలీసులు నాందేడ్ ఎస్పీ సంజయ్ యాదవ్ తో సంప్రదించి, నాందేడ్ పోలీసు టీమ్ ను ఎలర్ట్ చేసి బస్సును గుర్తించారు. 
నాందేడ్ లో పాత ఇనుప సామాన్లు అమ్మే వ్యక్తి కి చెందిన స్ధలంలో ఊడ తీసిన బస్సు అన్ని భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు ఊడతీయటానికి ఉపయోగించిన అన్ని పరికరాలను సహకరించిన 5 గురు పనివారిని, తుక్కు ఇనుము వ్యాపారం చేసే ఇద్దరిలో ఒకరిని, బస్సు చోరీ చేసిన అన్నదమ్ములైన ఇద్దరు పాత నేరస్ధులను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.  ఏ1,ఏ2గా ఉన్న బస్సు చోరి చేసిన అన్నదమ్ములపై గతంలో హైదరాబాద్ లోని పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయని , ఏ1పై పీడీ యాక్టుకూడా నమోదైందని ఆయన తెలిపారు.