మోడల్ ని హత్య చేసిన ఓలా డ్రైవర్

బెంగుళూరులో దారుణం జరిగింది. నగేశ్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మోడల్‌ను హత్య చేసి రూ.5లక్షలు కావాలని ఆమె భర్తకే మెసేజ్ చేశాడు. జులై 31న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన మోడల్, ఈవెంట్ మేనేజర్ అయిన పూజా సింగ్ డె(32) జులై 30న బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోల్‌కతా నుంచి బెంగుళూరు వచ్చింది. కార్యక్రమం పూర్తైన తర్వాత అక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ నగేశ్ ఆమెను ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్లకుండా ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్, విలువైన వస్తువులను లాక్కున్నాడు. అనంతరం ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
వెంటనే పూజ మొబైల్ నుంచి రూ.5లక్షలు కావాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త ఫోన్‌కు మెసేజ్ చేశాడు. దీంతో ఆమె భర్త కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజ మృతదేహాన్ని విమానాశ్రయం సమీపంలో గుర్తించిన స్థానికులు బెంగుళూరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో విచారణ చేపట్టిన వారికి కోల్‌కతా పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసును ఛేదించగలిగారు. నిందితుడు నగేశ్ ని అరెస్ట్ చేశారు