మా అబ్బాయి చాలా మంచోడు : ప్రేమలో ఫెయిలవ్వటం వల్లే డిప్రెషన్ లోకి వెళ్లాడు

పాకిస్తాన్ లో అరెస్టైన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడని.. మంచివాడని.. ప్రేమలో విఫలమై డిప్రెషన్ లో పాకిస్తాన్ వెళ్లి ఉంటాడని ఆయన తండ్రి బాబూరావు చెప్పారు. బాబురావు కుటుంబం గత ఐదు ఏళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంది. 2017కి పూర్వం ప్రశాంత్ హైదరాబాద్ లోనే ఉద్యోగం చేసేవాడు. అనతరం బెంగుళూరు లో ఉద్యోగం చేరాడు. అక్కడ సహోద్యోగిని స్వప్నికా పాండే అనే యువతితో ప్రేమలో పడ్డాడని, ఆమె అతడిని వదిలి స్విట్జర్లాండ్ వెళ్లి పోయిందని చెప్పారు.
స్వప్నికా పాండే నుంచి దూరం అయిన క్రమంలో డిప్రెషన్ లోకి వెళ్లి… పొరపాటున పాకిస్తాన్ వెళ్లి వుంటాడని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తన కుమారుడు కనిపించటంలేదని 2017, ఏప్రిల్ 29న మాదాపూర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాబురావు తెలిపారు.
ప్రశాంత్, స్వప్నికా పాండే గురించి గూగుల్ మ్యాప్ లో వెతుకుతుండగా లొకేషన్.. రాజస్తాన్ సరిహద్దుల్లో చూపించడంతో.. తన స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లాడు. రాత్రి వేళ సరిహద్దులూ దాటాడు. ఆ ప్రయత్నంలో కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా తిరుగుతున్న ప్రశాంత్ ను అతడి స్నేహితుడు వారిలాల్ ను.. అక్కడ గస్తీ తిరుగుతున్న పాకిస్తాన్ సైన్యం అరెస్టు చేసింది.
బెంగుళూరులో ప్రశాంత్ ఉద్యోగం చేసే రోజుల్లో చైనా, ఆఫ్రికా కూడా వెళ్లి వచ్చాడని కేవలం ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అవటం వల్లే పాకిస్తాన్ బోర్డరు లోకి ప్రవేశించి ఉంటాడని బాబూరావు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి విదేశాంగ శాఖ సహాయంతో తన కుమారుడిని క్షేమంగా అప్పగించమని కోరతానని ఆయన చెప్పారు.