Cyber Crime : కొంపముంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్..! ఏకంగా 11 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్..
ఓ వ్యక్తి పోలీస్ డ్రెస్ లో కనిపించాడు. దీంతో వృద్ధురాలికి ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వృద్ధురాలిని బాగా భయపెట్టాడు.

Cyber Crime : ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో మాయ చేసి అడ్డంగా దోచుకుంటున్నారు. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్ ద్వారా ఓ రిటైర్డ్ టీచర్ ను బురిడీ కొట్టించారు. ఏకంగా 11 లక్షలు కాజేశారు. ఈ షాకింగ్ ఘటన ముంబైలోని గోరేగావ్ లో జరిగింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్స్ తో జాగ్రత్త..
బాధితురాలు టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యింది. అయితే, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని వెతకసాగింది. ఈ క్రమంలో ఓ లీడింగ్ న్యూస్ పేపర్ లో ఆమె ఓ యాడ్ కనిపించింది. అది ఓ పార్ట్ టైమ్ జాబ్ కి సంబంధించిన యాడ్. పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలంటే ఈ నెంబర్లను కాంటాక్ట్ చేయండి అని కొన్ని నెంబర్లు ఇచ్చారు. దీంతో రిటైర్డ్ టీచర్ సంబరపడిపోయింది. హమ్మయ్య వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికేసినట్లే అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. అయితే, అది పెద్ద ఫ్రాడ్ అనే విషయం అప్పుడామెకు అర్థం కాలేదు.
ఆ యాడ్ లో ఉన్న నెంబర్ కి ఆమె ఫోన్ చేసింది. ఓ వ్యక్తి ఫోన్ తీశాడు. తన పేరు వినోద్ అని చెప్పాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. జాబ్ వివరాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత అడ్వాన్స్ గా 50వేల రూపాయల పేమెంట్ చేయాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరింపు..
కాసేపటి తర్వాత ఆమెకు మరో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే.. అవతలి నుంచి ఓ వ్యక్తి ఆమెను బెదిరించాడు. మీ ఫోన్ నెంబర్ మనీ లాండరింగ్ కేసుతో కనెక్ట్ అయ్యి ఉందని, మీ ఫోన్ సర్వీసులను సస్పెండ్ చేస్తామని బెదిరించాడు. అంతేకాదు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను కలవాలని చెప్పాడు. మనీలాండరింగ్, కేసులు, పోలీసులు అనేసరికి వృద్ధురాలు బాగా భయపడిపోయింది.
కాసేపటికి ఆమె వీడియో కాల్ వచ్చింది. ఆ పక్కన ఓ వ్యక్తి పోలీస్ డ్రెస్ లో కనిపించాడు. దీంతో వృద్ధురాలికి ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వృద్ధురాలిని బాగా భయపెట్టాడు. మీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. ఆ తర్వాత ఆమె బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సేకరించాడు. తర్వాత ఫోన్ పెట్టేశాడు.
ఇంతలో ఆమె ఫోన్ కు డబ్బులు కట్ అయినట్లు మేసేజ్ లు వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాల నుంచి 11 లక్షలు రూపాయలు కట్ అయినట్లు మేసేజ్ రావడం చూసి వృద్ధురాలు ఖంగుతింది. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆన్ లైన్ లో ఇచ్చే యాడ్స్ పట్ల జాగ్రత్త..
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఆన్ లైన్ లో ఇచ్చే యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏ నెంబర్ కు పడితే ఆ నెంబర్ కు ఫోన్ చేయడం చాలా ప్రమాదం అన్నారు. ఇలాంటి ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా ఫోన్ చేసి పోలీసులం అని బెదిరిస్తే భయపడొద్దని సూచించారు. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.