1 నుంచి 6వరకే.. తెలుగు మస్ట్ : ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (నవంబర్ 20, 2019) ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ప్రతీ ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంచుతూ పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నారు.
గతంలో ఇచ్చిన 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం జీవోలో మార్పు చేశారు. తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్ కచ్చితంగా ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం అమలుతోపాటు తెలుగు, ఉర్దూలో ఒక భాష తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం సూచించింది
ఇంగ్లీష్ మీడియం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టేలా విద్యాశాఖ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు వీలుగా టీచర్ల హ్యాండ్ బుక్ లు, శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని ఎస్ఈఆర్ఈటీకి ఆదేశించారు. టీచర్ల నైపుణ్యాల అభివృద్ధికి ఎస్ఈఆర్టీతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మాతృభాషను మసకబారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంగ్లీష్ అవసరమే కానీ.. తెలుగును విస్మరిస్తూ ఊరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.