Gold Price: పసిడి పరుగులు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ హై.. కొనాలా? వద్దా?
పండుగ సీజన్ ప్రారంభం కాగానే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ పరిణామాలు పసిడి దూకుడుకు కారణమవుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,21,000 మార్కును అధిగమించింది. నేడు ఒక్కరోజే రూ. 1150 పెరగడంతో, హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రూ. 1,21,000 పలుకుతోంది. గత రెండు రోజుల్లోనే సుమారు రూ. 3,000 పెరుగుదల కనిపించింది. డాలర్ బలహీనపడటంతోనే పసిడి ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు మళ్లీ తగ్గుతాయనే వార్తలతో పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారం వైపు చూస్తున్నారు. గత 14 ఏళ్లలో ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడం ఇదే మొదటిసారి. ఔన్స్ గోల్డ్ ధర 3,900 డాలర్ల సమీపంలోకి చేరింది. ఆల్-టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తూ, గత నెల రోజుల్లో 12% పైగా బంగారం ధర పెరిగింది. ప్రస్తుత గ్లోబల్ అనిశ్చితి, విధాన నిర్ణయాల్లో అస్థిరత కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, 2 లక్షల మార్కును కూడా చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొని, భౌగోళిక రాజకీయ అనిశ్చితి తగ్గితే ధరల్లో కొంత స్థిరీకరణ ఉండవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి