అన్నకు ప్రాణదానం చేసిన IVF baby..పుడుతూనే అన్నయ్య ఆయుష్షు పెంచిన పసిబిడ్డ

IVF baby : ఏజన్మలో బంధమోగానీ..ఓ చిన్నారి తనకంటే ముందు పుట్టి భయంకరమైన వ్యాధితో బాధపడే అన్నకు ప్రాణదానం చేసింది. తాను పుడుతూనే అన్నకు ఆయుష్షును పెంచింది. ఓ చిన్నారి పసిగుడ్డు ఈ లోకంలోకి వస్తూనే ఆ దేవుడి దగ్గర అన్నకు ప్రాణదానం చేయమని వేడుకుని వచ్చినట్లుగా ఆ కుటుంబం పాలిట సంతోషమై పుట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
థలసేమియా. చిన్నారులపాలిట మృత్యువులా మారింది. ఎంతోమంది చిన్నారులు ఈ మహమ్మారికి బలైపోతున్నారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన ఓ చిన్నారి థలసేమియాతో బాధపడుతున్న తన అన్నకు ప్రాణం పోసింది. పుడుతూనే తన ఎముక మజ్జను తోబుట్టువుకు దానం చేసి అన్న పాలిట ఆయుష్పును పంచిన వరంగా మారింది. హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్‌గా ఓ ప్రాణం నిలుపడం భారత వైద్య చరిత్రలో ఇదే తొలిసారి అని సీనియర్ డాక్టర్లు సైతం చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే..సహదేవ్ సింగ్ సోలంకి, ఆల్పా సోలంకి దంపతులకు బిడ్డ అభిజీత్ పుట్టాడు. కానీ అభిజీత్ పుట్టుకతోనే థలసేమియా మేజర్‌తో పుట్టాడు. దీంతో ఆ పిల్లాడికి బ్రతికి ఉన్నంత కాలం కొత్త రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఇటువంటి సమస్యతో అభిజీత్ ను బ్రతికించుకుంటున్నారు సహదేవ్ సింగ్ దంపతులు.
థలసేమియా ఉన్న పిల్లలకు రక్తం ఎముక మూలుగలో హిమగ్లోబిన్ ఉండే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి నిలిచిపోతుంది. కానీ ఎలాగైనా కొడుకుని బతికించుకోవటానికి సోలంకి దంపతులు తిరగని హాస్పిటల్ అంటూ లేదు. ఎంతో మంది సీనియర్ డాక్టర్లని కలిసారు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టారు.అలా ఓ సీనియర్ డాక్టర్ ఇచ్చిన సూచన వారి జీవితాల్లో వెలుగుల్ని నింపింది. కొడుకును బతికించుకోవచ్చనే భరోసాను కల్పించింది.
ఎముక మూలుగ మార్పిడి చేయించడం ద్వారా పిల్లాడిని బతికించుకోవచ్చునని డాక్టర్ సలహాపై తమ కుటుంబసభ్యుల ఎముక మూలుగ ఇచ్చి బతికించుకుందామనుకున్నారు. కానీ ఎవ్వరిదీ మ్యాచ్ కాలేదు. హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ (హెచ్‌ఎల్‌ఏ) మ్యాచ్ దొరకడం కష్టంగా మారింది. దీంతో డాక్టర్ల సలహాతో ఎముక మజ్జ మార్పిడికి హెచ్‌ఎల్‌ఏ దాతను పొందేందుకు ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కనేందుకు సోలంకి దంపతులు సిద్ధమయ్యారు. కొడుకును బతికించుకోవటం కోసం.
అహ్మదాబాద్‌లోని నోవా ఐవీఎప్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ బ్యాంకర్‌ను కలిసి ఐవీఎఫ్ ద్వారా గర్భం ధరించేందుకు సిద్ధపడ్డారు. థలసేమియా వ్యాధితో బాధపడుతున్న అన్నను కాపాడేందుకు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనాలనుకున్న సోలంకి దంపతులకు డాక్టర్ మనీష్ బ్యాంకర్ బృందం అన్ని విధాలుగా అండగా నిలిచింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
అలా వారి కృషి..అభిజీత్ అదృష్టం..సోలంకి దంపతుల ఆశలు ఫలించి 2019 చివరిలో అల్పా సోలంకి పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కావ్య అని పేరు పెట్టుకున్నారు. అలా పుట్టిన చిన్నారి కావ్య హెచ్‌ఎల్‌గా గుర్తించబడింది. గత మార్చి నెలలలో చిన్నారి మరింత ఆరోగ్యకరంగా మారింది. దీంతో తాము అనుకున్నట్లుగా అత్యంత జాగ్రత్తగా ‘‘ఎముక మజ్జ మార్పిడి ఆపరేషన్’’కు డాక్టర్ల బృందం శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేశారు.
ఎముక మూలుగ మార్పిడి విజయవంతం కావడంతో అభిజీత్ చిన్నారి చెల్లెలు కావ్యతోపాటు అన్న అభిజీత్ కూడా పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం అభిజీత్‌కు రక్తం మార్పిడి చేయాల్సిన అవసరం లేదని డాక్టర్ బ్యాంకర్ తెలిపారు. ఐవీఎఫ్ విధానంలో పుట్టి హెచ్‌ఎల్‌ఏగా మారి అన్నను బతికించుకోవడం భారతదేశ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి అని డాక్టర్ బ్యాంకర్ పేర్కొన్నారు.
ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కనటానికి నిర్ణయించుకోవడం వల్ల తన కుమారుడు అభిజీత్ ను థలసేమిగా వ్యాధి బారి నుంచి రక్షించుకోగలిగామని సహదేవ్‌సింగ్ సోలంకి సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. పుడుతూనే అన్నను బతికించుకున్న తన బిడ్డ కావ్య దేవుడు తమకోసం పంపించిన దేవత అని తెగ మురిసిపోతున్నారు. కావ్యవ మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని నింపిందనీ..జీవించాలనే ఆశను ఇచ్చినం డాక్టర్లందరికీ చేతులెత్తి దణ్ణం పెట్టి ధన్యవాదాలు తెలిపారు సోలంకి దంపతులు. వారికి తమ జీవితాంత రుణపడి ఉంటామని తెలిపారు.