రాష్ట్రంలో రోడ్లను అద్దంలా మార్చాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రోడ్లను అద్దంలా మార్చాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదార్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
12,751 గ్రామ పంచాయతీల్లోనూ బీటీ రోడ్లు వేయాలన్నారు. రోడ్ల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన బడ్జెట్ ను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం నుంచి రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించామని తెలిపారు. పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్మాణం చేపట్టామని.. కొత్తగా నిర్మించిన క్వార్టర్లను ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని చెప్పారు.