నిప్పుల కుంపటిలా తెలంగాణ

భానుడి ప్రచండ ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. మరో వైపు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆది, సోమ వారాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణుల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసి కొంత చల్లబడినప్పటికీ మంగళవారం నుండి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు సూర్యుడు. గురవారం నుండి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖా అధికారులు ప్రకటించారు.
ఉత్తర భారతదేశంతోపాటు రాజస్థాన్ ఎడారుల నుండి వస్తున్న వేడి గాలుల ప్రభావంతో మధ్య భారతాన్ని ఆనుకుని ఉన్న తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. అక్కడి నుండి వీస్తున్న వేడిగాలులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలను మరింత పెంచుతాయంటున్నారు. ఈ వేడి గాలుల ప్రభావం కోర్ హీట్ వేవ్ జోన్ లో ఉన్న ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉంటుందన్నారు. వాయవ్య భారతంలోని రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణవైపు వీచే పొడిగాలుల కారణంగా విదర్భను ఆనుకొని ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలో అధిక వేడితో వడగాలులకు కారణమంటున్నారు.
ఉత్తర తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, రూరల్, నల్లగొండ జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుంది. ఇక వేడి గాడ్పుల వల్ల వడదెబ్బకు గురై పలువురు మృత్యువాత పడుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలే ఉన్నారు.