ఇంటిపై కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాలు : రూ.10వేలు ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

ఇంటిపై పాత సామాను ఉన్నందుకు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తికి రూ.10వేలు ఫైన్ వేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బీఎన్ రెడ్డి నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిపైకి వెళ్లి చూసి షాక్ తిన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పాత సామాన్లు కనిపించాయి. చెడిపోయిన కూలర్లు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, ఇతర వస్తువులు అనేకం ఉన్నాయి. దీంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్లో రెంట్ కి ఉంటున్న వ్యక్తికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఇంటి ఓటర్ వేరే ప్రాంతంలో ఉన్నాడని అధికారులు తెలిపారు. పాత సామాగ్రి ఇంట్లో రెంట్ కి ఉంటున్న వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. ఇంట్లో పాత సామాను ఉంటే ఫైన్ వేయడం ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ.. పాత సామాగ్రి వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులు రీసైక్లథాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టన్నుల కొద్దీ పాత వస్తువులు బయటపడ్డాయి.
ఇటీవల జీహెచ్ఎంసీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలతో తిరిగారు. పాత వస్తువులను సేకరించారు. అయితే ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి మాత్రం పాత సామాను అప్పగించ లేదు. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. పాత కూలర్లలో వర్షం నీరు నిలిచిందని.. అందులో దోమలు లార్వా దశలో ఉన్నాయని చెప్పారు. ఇలా పాత సామాన్లు బయట పెట్టడం కారణంగా వ్యాధులు విజృంభిస్తాయన్నారు. డెంగీ, మలేరియా వంటి రోగాలు వ్యాప్తి చెందడానికి ఇలాంటి పనులు కారణం అవుతాయని వివరించారు. పాత సామాన్లు ఎక్కడ పడితే అక్కడ వేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.