చుక్కకు కిక్కు: త్వరలో పెరగనున్న మద్యం ధరలు

  • Published By: chvmurthy ,Published On : November 19, 2019 / 04:37 AM IST
చుక్కకు కిక్కు: త్వరలో పెరగనున్న మద్యం ధరలు

Updated On : November 19, 2019 / 4:37 AM IST

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగగా.. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం యోచనలో ఉంది. ఆదాయ అన్వేషణలో భాగంగా మద్యం ధరలను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను వారికి అప్పగించేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం. సబ్‌కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5నుంచి10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమోదిస్తే ఏటా రూ. 1,200 నుంచి 1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆ వర్గాల అంచనా. 

ఈ ప్రతిపాదనలను త్వరలోనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే అంశంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు మధ్య ఇటీవల చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ నిర్ధారించిన ధరలపై కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు.

త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు జాప్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా ఏర్పాటైన 73 మున్సిపాలిటీల్లో కూడా బార్‌ నోటిఫికేషన్‌ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాటు రాజధాని, దాని శివార్లలో, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలో మద్యం ధరల పెంపు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు నోటిఫికేషన్, ఈవెంట్‌ చార్జీల పెంపు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎక్సైజ్‌ వర్గాలు అంటున్నాయి.