సభకు వేళాయెరా : 32ఏళ్ల తర్వాత అసెంబ్లీకి కొత్త సొబగులు

తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 05:02 AM IST
సభకు వేళాయెరా : 32ఏళ్ల తర్వాత అసెంబ్లీకి కొత్త సొబగులు

Updated On : January 17, 2019 / 5:02 AM IST

తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  •  నేడు కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
  • అసెంబ్లీ భవనానికి కొత్త సొబగులు
  • 32ఏళ్ల తర్వాత అసెంబ్లీ భవనానికి రంగులు
  • ఉదయం 11.30కు శాసనసభ ప్రారంభం
  • ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌కు చేరుకోనున్న సీఎం
  • అమరులకు నివాళులు అర్పించనున్న కేసీఆర్‌

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జనవరి 18న స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది.

తెలంగాణ రెండో శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు శాసనసభ మొదలుకానుంది. అయితే శాసనసభ సమావేశాలకు ముందుగానే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకుంటారు. అమరవీరుల స్థూపం దగ్గర ఆయన అమరులకు నివాళులు అర్పిస్తారు. సీఎంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీకి చేరుకుంటారు.

 

అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ఎంఐఎం సీనియర్‌ శాసనభ్యుడు ముంతాజ్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు రెండు గంటలపాటు జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం జూబ్లీహాల్‌ కౌన్సిల్‌ లాన్‌లో ఎమ్మెల్యేలకు లంచ్ ఏర్పాటు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌ ఎన్నికవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదు. స్పీకర్‌ ఎన్నిక తర్వాత రాజాసింగ్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

శాసనసభా సమావేశాలను పురస్కరించుకుని అసెంబ్లీ భవనానికి కొత్త సొబగులు అద్దారు. అసెంబ్లీ భవనాలకు 32 ఏళ్ల తర్వాత రంగులు వేసి ముస్తాబు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ సభ్యులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీలో పార్టీలకు కేటాయించే శాసనసభాపక్ష కార్యాలయాలకు కూడా కొత్తగా రంగులు అద్దారు. దీంతో శాసనసభ అందంగా ముస్తాబైంది.

20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం
శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసన తర్వాత స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్‌ వేసే అవకాశముంది. ఈనెల 18న స్పీకర్‌ ఎన్నిక జరుగనుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను సభానాయకుడు కేసీఆర్‌, ప్రతిపక్ష నేతలు, ఇతర సభ్యులు స్పీకర్ స్థానానికి తోడ్కొని వెళతారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ అధ్యక్షతన సభాకార్యక్రమాలు కొనసాగుతాయి. స్పీకర్ ఎన్నిక ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరుగుతుంది. 19న సభలో శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలుపనుంది. నేటితో మొదలయ్యే శాసనసభా సమావేశాలు ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి.

ఇక శాసనసభ స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పీకర్‌ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీనియర్‌ సభ్యులకే స్పీకర్‌ పదవి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్‌గా ఎన్నుకొనే అవకాశముంది.