Telangana Assembly Session 2022 : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్ర వైఖరిని ప్రశ్నించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభ ఎన్నిరోజులు జరగాలి అనే అంశంపై ఈ రోజు జరిగే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కేంద్ర వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తుంటే, ప్రజా సమస్యల్ని లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Telangana Assembly
Telangana Assembly Session 2022: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల మావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో అధికారులు పలు ఆంక్షలు విధించారు.
Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది
చుట్టుపక్కల సభలు, సమావేశాలు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదు. అసెంబ్లీ లోపల నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. సభ ఎన్నిరోజులు జరపాలి అనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ జరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం మూడు రోజులపాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. అందువల్ల కేంద్రానికి వ్యతిరేకంగా సభలో గళమెత్తే అవకాశం ఉంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, విద్యుత్ చట్టాలు, రుణాలకు అడ్డంకులు, పునర్విభజన చట్టంలోని అంశాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు. సీబీఐకి చెక్ పెట్టేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. మరోవైపు.. సర్కారును ఇరుకునపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ధరణి, పోడుభూముల సమస్యలు, రైతులకు నష్ట పరిహారం, కాళేశ్వరం పంప్ హౌజ్ మునక, రైతు రుణ మాఫీ వంటి అంశాల్ని సభలో ప్రస్తావించి సర్కారును ప్రశ్నించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీలో సభ ప్రారంభమైన తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 4వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రూల్స్ 2022 పత్రాన్ని హోం మంత్రి మహమూద్ అలీ సభకు సమర్పిస్తారు. గత మార్చిలో చివరిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజా సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం అందింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం వారికి సమాచారం అందించింది.