తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది : బడ్జెట్ పై కేసీఆర్

  • Published By: chvmurthy ,Published On : February 1, 2020 / 03:10 PM IST
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది : బడ్జెట్ పై కేసీఆర్

Updated On : February 1, 2020 / 3:10 PM IST

కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రానికి  రావాల్సిన నిధుల్లో  కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. 

కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని ఆయన మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో శనివారం ఫిబ్రవరి1, దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. 

చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తోందని…14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా  రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదుని కేసీఆర్ తెలిపారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసిందని… ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించామని… అయినా వారు పట్టించుకోలేదన్నారు.  ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదని కేసీఆర్ చెప్పారు. 

 

కేంద్ర బడ్జెట్ పై ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్:
* కేంద్ర బడ్జెట్ నిరాశపర్చింది
* రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతుంది
* తెలంగాణకు రూ.24వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ సూచించింది
* నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు
* ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం