త్వరలో తప్పుకుంటా: తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్ సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. కొద్ది రోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల తప్పుకోబోతున్నట్లు వెల్లడించారు. హుజూర్‌నగర్ సమావేశంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు నిర్ణయాన్ని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇకపై సొంత నియోజకవర్గానికి మాత్రమే టైమ్ కేటాయిస్తానని అన్నారు. ఇకపై హుజూర్‌నగర్, కోదాడ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 2015లో టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస ఓటములు రావడంతో పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు పుకార్లు వినిపించాయి.
అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న తరుణంలో ఆ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ పదవి కోసం మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.