Joe Biden : డెడ్‌లైన్‌లోగా మిషన్ పూర్తిచేస్తాం : బైడెన్
అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు, అఫ్ఘాన్ పౌరుల తరలింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు అధ్యక్షుడు జో బైడెన్ తెరదించేశారు. ఆగష్టు 31 డెడ్‌లైన్ పొడిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.

Us President Joe Biden Decides To Stick With August 31 Final Pullout From Kabul
August 31 Final Pullout from Kabul : అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు, అఫ్ఘాన్ పౌరుల తరలింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు అధ్యక్షుడు జో బైడెన్ తెరదించేశారు. ఆగష్టు 31 డెడ్‌లైన్ పొడిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. డెడ్ లైన్ లోగా మిషన్ పూర్తి చేస్తామని బైడెన్ స్పష్టం చేశారు. జాతీయ భద్రతా బృందంతో సంప్రదించిన తర్వాత బైడెన్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అప్ఘాన్ భూభాగంపై అమెరికా దళాలు ఉంటే కలిగే పరిణామాల దృష్ట్యా మంగళవారం నాటికి మిషన్‌ను పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. ఆగస్టు 15న తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ స్వాధీనం చేసుకోవడానికి ముందే బైడెన్ ఈ డెడ్ లైన్ నిర్దేశించారు.
ఒకవేళ.. గడువును కొద్దిగా పొడిగించాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు తన జాతీయ భద్రతా బృందాన్ని ఆకస్మిక ప్రణాళికలను రూపొందించమని కోరారు. ముందుగా నిర్దేశించిన ఈ నెల 31లోగా తమవారందర్నీ తరలించడం పూర్తి చేస్తామన్నారు. శరణార్థుల తరలింపు కోసం గడువు పొడిగించేందుకు ఆయన నిరాకరించారు. ఈ నెల 31 కల్లా తరలింపు చర్యలు పూర్తవడం కష్టమని, మరికొన్నాళ్లపాటు గడువు పొడిగించాలని బ్రిటన్ సహా అమెరికాలోని యూరోపియన్ మిత్రదేశాలు అలాగే యుఎస్ చట్టసభ సభ్యులు, పలు దేశాలు బైడెన్‌ను కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై జాతీయ భద్రత బృందంతో బైడెన్ చర్చలు జరిపారు. అనంతరం గడువు పొడిగింపు కుదరదన్నారు. వీలైనంత త్వరగా పౌరులను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణకు గురైన అప్ఘాన్ నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియ ఈనెల 31కి పూర్తవుతుందని బ్రిటన్ స్పష్టంచేసింది. ఈ నెలాఖరు నాటికి తమ బలగాలను అక్కడి నుంచి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్టు స్పష్టం చేసింది. దేశ పౌరులు, సామగ్రిని కాబుల్ నుంచి ఉపసంహరించుకొనేందుకు తమ సైన్యానికి కొంత సమయం అవసరమని, కానీ, ఉన్న సమయాన్నే సమర్థంగా వినియోగించుకుంటామని పేర్కొంది.