విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్, 10లక్షల మంది వెనక్కి

తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో విద్యనభ్యసించే విద్యార్థులను తమ దేశంలో ఉండడానికి అనుమతించబోమని అమెరికా స్పష్టం చేసింది. కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, విదేశీ విద్యార్థులు ఇక తమ స్వస్థలాలకు బయలుదేరవచ్చని ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ)విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాలోనే ఉంటే తీవ్ర పరిణామాలు:
తమ హెచ్చరికను పట్టించుకోకుండా విదేశీ విద్యార్థులెవరైనా ఇంకా ఇక్కడే ఉంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ చెప్పింది. వారికి వీసాలను ఉపసంహరిస్తామంది. ఎఫ్-1 విద్యార్థులు అకడమిక్ కోర్స్ వర్క్ ను, ఎం-1 స్టూడెంట్స్ ఒకేషనల్ కోర్స్ వర్క్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో సుమారు పది లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా కారణంగా పలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతబడడంతో వారికి ఆన్ లైన్ క్లాసులే దిక్కయ్యాయి. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైనందున విద్యార్థులు తమ దేశంలో ఉండాల్సిన పనిలేదని అమెరికా అంటోంది. ఆన్‌లైన్ చదువుల కోసం రిజిస్టర్ చేసుకున్న వారు దేశం విడిచి వెళ్లచ్చని ఐసీఈ(Immigration and Cutoms Enforcement) స్పష్టం చేసింది.
10 లక్షల మంది విద్యార్థులు వెనక్కి:
ప్రభుత్వం కొత్త నిర్ణయంతో విదేశీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. సుమారు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అమెరికాలో యాక్టివ్ స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. వారిలో 2 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. చాలామంది విద్యార్థులు చైనా(3లక్షల 69వేలు) నుండి వచ్చారు. ఆ తర్వాత భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా విద్యార్థులు ఉన్నారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విద్యార్థులకు ఎఫ్-1, ఎం-1 కేటగిరీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పుడు ఈ వీసాలను ఉపసంహరించుకున్నారు. ఈ వీసా కలిగిన విద్యార్థులు ప్రస్తుతానికి అమెరికాలో నివసించలేరని, తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది.
Read Here>>నియాండర్తల్స్ మానవులలో కరోనా వైరస్ మూలం?