కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా విశాఖ.. 24 గంటల నిఘా  

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 01:05 AM IST
కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా విశాఖ.. 24 గంటల నిఘా  

Updated On : October 31, 2020 / 2:41 PM IST

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరాయంగా పోరాడుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం.. దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయిన వెంటనే అప్రమత్తమైన అధికార బృందం యుద్దప్రాతిపదకన అనేక చర్యలు చేపట్టింది. నగరాన్ని 24 గంటలు డేగకన్నుతో పరిశీలిస్తూ కరోనా కట్టడికి కృషి​ చేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

కరోనాపై నగర ప్రజల్లో అవగాహన పెంచే దిశగా 90 ప్రాంతాల్లో బహిరంగ ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విశాఖ మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా పెట్టారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే వీధుల్లో కరోనాపై అవగాహన కోసం 10 డిజిటల్‌ సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ ఆఫీసులో 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.  24 గంటలు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తూ నిరంతరం అప్రమత్తతో పనిచేస్తున్నారు. (ఏపీలో మే 4 నుంచి మద్యం విక్రయాలు, కొత్త నిబంధనలు ఇవే)

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్‌ వ్యవస్థతో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా పాజిటివ్‌/అనుమానితులను వేగంగా గుర్తించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్‌ జోన్లుగా ప్రకటించారు. అంక్షలు విధించి అక్కడ వారిని బయటకు రానీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు. వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. స్మార్ట్‌ సిటీ విశాఖలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చిందని అధికారులు అంటున్నారు. ప్రజల్లో కూడా చైతన్యంతో వ్యవహరించడంతో విశాఖలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టయింది.