దగ్గుబాటి ఫ్యామిలీ కోటి.. మహేష్ మరో పాతిక లక్షలు..
కరోనా ఎఫెక్ట్ : సురేష్ ప్రొడక్షన్స్, మహేష్ బాబు సినీ కార్మికులు మరియు వైద్య సిబ్బంది కోసం ఆర్థిక సహాయం..

కరోనా ఎఫెక్ట్ : సురేష్ ప్రొడక్షన్స్, మహేష్ బాబు సినీ కార్మికులు మరియు వైద్య సిబ్బంది కోసం ఆర్థిక సహాయం..
కరోనాపై పోరాటంలో దగ్గుబాటి ఫ్యామిలీ తమ వంతు భాగస్వామ్యం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధంలో నిరంతరం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడక్షన్స్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. రోజువారీ వేతనంతో పనిచేసే సినీ కార్మికులు నిత్యావరాల కోసం కష్టపడుతున్నారనీ, వాళ్లను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి, సురేశ్ ప్రొడక్షన్స్ కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నామని సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా తెలిపారు. అలాగే తమ జీవితాలకు ప్రమాదం అని తెలిసినా నిత్యం రోగులతో సన్నిహితంగా మెలగుతూ వారి ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ వస్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు.
ఈ సంక్షోభ కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ విధిగా పాటించాలని సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా కోరారు. అత్యవసరం అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలని, గుంపులుగా మాత్రం వెళ్లవద్దని వారు చెప్పారు. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాలకు సహకరిస్తూ కరోనాపై పోరాటంలో విజయానికి తోడ్పడాలని సురేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. అందరూ తమ తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు.
లాక్ డౌన్ వలన రోజు వారీ సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ వర్కర్స్ ఛారిటీ కోసం 25 లక్షలు ప్రకటించారు. ఇంతకుముందే కరోనా నిర్మూలన చర్యల కోసం తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీఎమ్ సహాయ నిధికి) విరాళంగా అందించారు. తాజాగా సినీ వర్కర్స్ ఛారిటీ కోసం మహేష్ బాబు ప్రకటించిన 25 లక్షల రూపాయల విరాళంతో మహేష్ బాబు కరోనాపై పోరాటానికి 1 కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.