Pushpa Effect: పుష్ప దెబ్బకు సంక్రాంతి పందెం కోళ్లకు టెన్షన్ స్టార్ట్

సీఎం రేవంత్ ప్రకటనతో.. టాలీవుడ్ పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్.

Pushpa Effect: పుష్ప దెబ్బకు సంక్రాంతి పందెం కోళ్లకు టెన్షన్ స్టార్ట్

Updated On : December 23, 2024 / 9:41 PM IST

పుష్ప దెబ్బకు.. సంక్రాంతి పందెం కోళ్లకు టెన్షన్ స్టార్ట్ అయింది. బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ ప్రకటించడంతో.. పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఇక సర్కార్ నిర్ణయంపై చిన్న నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బడా వర్సెస్‌ చిన్న నిర్మాతలు అన్నట్లు సీన్ మారింది. ఇంతకీ వాళ్ల భయమేంటి.. వీళ్ల ఆనందం ఏంటి..

సంధ్య థియేటర్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్‌.. ఇకపై సినిమాల బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్ద నిర్మాతల్లో టెన్షన్‌ మొదలైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ కీలకం. దేశ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చినా… ఇందులో నైజాం కలెక్షన్స్ ను ప్రత్యేకంగా ప్రకటిస్తుంటారు.

రాయలసీమ, సీడెడ్‌లో థియేటర్లు ఎక్కువ ఉన్నా.. ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండె లాంటిది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్​వివాదం ఎఫెక్ట్​.. రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సీఎం రేవంత్ ప్రకటనతో.. టాలీవుడ్ పెద్ద హీరోలు, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్. బెనిఫిట్ షోలు లేకపోతే.. వసూళ్లపై భారీ ప్రభావం పడడం ఖాయం. దీంతో సీఎం రేవంత్‌ను కలవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. తమ సమస్యలు చెప్పి.. టిక్కెట్ రేట్ల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని కోరే అవకాశం ఉంది.

FDC చైర్మన్‌ దిల్ రాజ్ అమెరికా నుంచి రాగానే.. ఓ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డిని కలవాలని అనుకుంటున్నారు బడా నిర్మాతలు. వీళ్ల కంగారు ఇలా ఉంటే.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చిన్న నిర్మాతలు, సింగిల్ స్క్రీన్‌ థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ధరలు పెంచడంతో.. సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని.. ఇది సినిమా చూసే జనాల సంఖ్య మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

సీఎం రేవంత్ నిర్ణయం.. సింగిల్‌ స్క్రీన్ థియేటర్‌లకు మరో నాలుగేళ్ల పాటు ప్రాణం పోసినట్లు అయిందని.. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ, తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలన్న నిర్ణయం కరెక్ట్‌ కాదని అంటున్నారు. సీఎం రేవంత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు అన్నట్లుగా సీన్ మారిపోయింది.

Pushpa 2 : ఓ వైపు అల్లు అర్జున్ వివాదం.. అయినా మరోవైపు పుష్ప 2 రికార్డులు.. లేటెస్ట్ రికార్డ్ ఏంటో తెలుసా?