భారత్‌లో 5కి చేరిన కరోనా మరణాలు

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 05:10 AM IST
భారత్‌లో 5కి చేరిన కరోనా మరణాలు

Updated On : March 22, 2020 / 5:10 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. భారత్ కరోనా మరణాల సంఖ్య 5కి పెరిగింది. ముంబైలోనే రెండో మరణం చోటు చేసుకుంది. ఆదివారం(మార్చి 22,2020) 63ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. మరోవైపు మహారాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం ఒక్క రోజే మహారాష్ట్రలో 10 కరోనా కేసులు(ముంబైలో 6, పుణెలో4) నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 74కి పెరిగింది. కాగా వీరిలో కొందరు ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. విదేశాలకు వెళ్లకపోయినా కరోనా వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది.

మొదటగా కర్నాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఆ తర్వాత ఢిల్లీలో ఒకరు కరోనాతో చనిపోయారు. మార్చి 17న ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 64ఏళ్ల వృద్ధుడు కరోనా మరణించాడు. ఆ తర్వాత పంజాబ్ లో 79ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. తాజాగా మహారాష్ట్రలో(ముంబై) 5వ కరోనా మరణం చోటు చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్ 185 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 6వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13వేల 17మంది కరోనాతో చనిపోయారు. 90వేల 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇటలీలో ఒక్క రోజే 793 మంది చరిపోయారు. ఇటలీలో ఇప్పటివరకు కరోనాతో 4వేల 825మంది మరణించారు.

కరోనా భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. ఐదుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.