Baba Shivanand: బాబా శివానంద్ (128) ఇక లేరు.. మోదీ, యోగి సంతాపం

యోగా ద్వారా సమాజానికి శివానంద చేసిన కృషికి 2022లో ఆయనను పద్మశ్రీ పురస్కారం వరించింది.

Baba Shivanand: బాబా శివానంద్ (128) ఇక లేరు.. మోదీ, యోగి సంతాపం

Updated On : May 4, 2025 / 6:36 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ (128) కన్నుమూశారు. బాబా శివానంద్ అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 30న వారణాసిలోని బీహెచ్‌యూ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

బాబా శివానంద్‌ ఆధ్యాత్మికత, యోగా, ధ్యాన సాధనను అలవరుచుకుని, జీవితాంతం వాటిని క్రమశిక్షణతో పాటించారు. యోగా ద్వారా సమాజానికి శివానంద చేసిన కృషికి 2022లో ఆయనను పద్మశ్రీ పురస్కారం వరించింది. సాంప్రదాయ భారతీయ విలువలు పాటిస్తూ ఉండడం, 128 ఏళ్ల వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం ఆయనకు దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

బాబా శివానంద్ 1896, ఆగస్టు 8న ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆకలితో మరణించడంతో ఆరేళ్ల వయసులో శివానంద అనాథ అయ్యారు. అనంతరం ఆయనను ఓంకార్ నంద్ స్వామి దగ్గర చేర్చుకున్నారు.

శివానందకు ఆధ్యాత్మిక గురువుగా ఓంకార్‌ నందర్ స్వామి యోగ, సన్యాస మార్గం వంటి అంశాల్లో మార్గనిర్దేశం చేశారు. కాగా, శివానంద పార్థివ దేహాన్ని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం కొన్ని గంటల పాటు ఉంచారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.

బాబా శివానంద్ పరమపదించడంపై ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ సంతాపం తెలిపారు. శివానంద్ బాబా కన్నుమూత చాలా బాధాకరమని, ఆయన యోగా సాధనకు జీవితాన్ని అంకితం చేశారని, ఆయన జీవితం భారత్‌లోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ తెలిపారు. శివానంద మృతి చాలా విచారకరమంటూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు.