ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో నడుస్తోంది. ఆయన సారథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొబోతోంది.

ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

Rahul-Modi

రాజకీయాలంటేనే గెలుపే ప్రధాన లక్ష్యం. అది లీడర్ కు అయినా పార్టీకైనా. లీడర్ లేకుండా పార్టీ ఉండదు. పార్టీ లేకుండా లీడర్ గా ఎదగడం కూడా కష్టం. అలా పార్టీలతో పాటు నేతలు కూడా ఎన్నికల సంగ్రామంలో చాలా కీలకం. తెరవెనక వ్యూహాలకు అయినా.. అద్బుతమైన మాటతీరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు అయినా లీడర్లే ముఖ్యం. లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో మోదీతో ప్రతిపక్ష నేతల ప్రచార తీరుపై ప్రజల దృష్టి ఏర్పడింది.

నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశ రాజకీయాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి. అది బీజేపీ అయినా, విపక్ష నేతలైనా మోదీ ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయడం లేదు. అభివృద్ధి, మేడిన్‌ ఇండియా, హిందుత్వ ఎజెండాతో ప్రజలకు దగ్గరయ్యారు మోదీ. పదేళ్ల కాలంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తనదైన ముద్ర వేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

బీజేపీ వ్యూహాలు
కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కౌంటర్‌గా మోదీ కీ గ్యారెంటీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. మూడోసారి అధికారం చేపడితే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చుదిద్దుతామని చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపేందుకు అవసరమైన కార్యాచరణను ప్రజలకు వివరిస్తున్నారు.

చేసిన అభివృద్ధి..భవిష్యత్ అంచనాలను వివరిస్తూ..యువత, మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. తన ప్రసంగంలో జాతీయభావంపై ప్రస్తావిస్తూ ప్రజలను ఆలోజింపచేస్తున్నారు. తనకు దేశ భవిష్యత్తే ముఖ్యమని.. ప్రతిపక్షపార్టీలు అయితే తమ కుటుంబాల గురించే ఆలోచిస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు మోదీ.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు మోదీ. ప్రపంచ వేదికల్లో పెరిగిన భారత్‌ బలాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. మూడోసారి ప్రధాని పదవి చేపట్టి జవహర్‌ లాల్‌ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును సమం చేయాలని భావిస్తున్నారు మోదీ.

ఇక బీజేపీ నేతలు అభినవ సర్ధార్ పటేల్‌గా పిల్చుకునే అమిత్ షా..పార్టీలో, కేంద్రం ప్రభుత్వంలో నెంబర్ గా ఉన్నారు. మోదీ తర్వాత బీజేపీ క్యాడర్ తో పాటు ప్రజలు ఎక్కువగా అభిమానించే నేతల్లో ఆయన ఒకరు. ఎన్నికల వ్యూహా రచనలో అమిత్ షాకు చాణక్యుడిగా పేరు. వ్యూహాత్మక అడుగులు వేయడంతో పాటు ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు అమిత్ షా.ఉత్తరాది రాష్ట్రాలలో హిందూ అంశాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ప్రతీసభలో రామమందిర నిర్మాణం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అమిత్ షా.

గెలుపైనా, ఓటమైనా ప్రజల్లోనే..
యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. గెలుపైనా, ఓటమైనా ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ వారసులు తప్ప కాంగ్రెస్ లో ఎవరూ అధ్యక్షుడు కాలేరన్న విమర్శలను తిప్పి కొట్టారు. సీనియర్ లీడర్ దళితుడైనా మల్లిఖార్జునఖర్గేను పార్టీ ప్రెసిడెంట్ చేసి తన మార్పు చూయించారు రాహుల్.

పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పదేళ్లుగా కష్టపడుతున్నారు. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్.. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. జోడోయాత్ర సాగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్లలో ఏకంగా అధికారాన్ని కోల్పోగా, గుజరాత్‌లో మళ్లీ ఓడిపోయింది కాంగ్రెస్.

రాహుల్ పాదయాత్ర చేసిన కర్నాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండోవిడత భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టి పూర్తి చేశారు రాహుల్. కులగణన, విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణాలు తెరుస్తాం అంటూ కొత్త నినాదాలను ఎత్తుకున్నారు. కులగణన చేసి.. రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇస్తూ.. యువతతో పాటు పలు వర్గాల ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారు.

రైతులను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెబుతున్నారు. ప్రజలను మత ప్రాతిపదికన బీజేపీ విడదిస్తోందని విమర్శిస్తూ మైనార్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్టే లక్ష్యంగా కేంద్రప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నారు రాహుల్.

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో నడుస్తోంది. ఆయన సారథ్యంలోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొబోతోంది. బలహీనంగా ఉన్న పార్టీని ఎక్కువ స్థానాల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఖర్గే. బీజేపీని అధికార పీఠం నుంచి గద్దె దించేందుకు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో కలిసివెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయని చెప్పి మధ్య తరగతి, యువత ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్.

ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు