బడ్జెట్ 2021-22 : దేశాన్ని అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్

Budget 2021 కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్-2021-2022పై విపక్షాలు పెదవి విరిచాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని..ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్ అని మండిపడ్డాయి. రోగమొకటైతే మందొకటి అన్నచందంగా బడ్జెట్ ఉందని కాంగ్రెస్ విమర్శించింది. క్షీణిస్తున్న జీడీపీని గాలికొదిలేశారని ఆరోపించారు.
బడ్జెట్‌తో పేదలకు అండగా నిలవాల్సిన మోడీ సర్కార్.. ప్రభుత్వ ఆస్తులను తన పెట్టుబడిదారి మిత్రులకు కట్టబెట్టేలా కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలకు ఊతమందించాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగానికి చేసిన కేటాయింపులపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు ఊతమిచ్చేలా గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావించామని కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌధురీ అన్నారు. అయితే అస్పష్టమైన చర్యలతో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించారన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ, ప్రవేటీకరణ వంటి చర్యలతో.. ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు.
ఆర్థిక మంత్రి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనందద్ శర్మ అన్నారు. బలహీన వర్గాలకు నేరుగా సాయమందిస్తే.. ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేవని శర్మ అన్నారు. ధనార్జన లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఆరోపించారు మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ. నేషనల్ మోనిటైజేషన్ ప్రణాళిక దేశాన్ని అమ్మేయడానికి ఓ సులభమైన మార్గమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజా బడ్జెట్ దేశం అభివృద్ధికి ఉపయోగపడేదిగా లేదని, దేశాన్ని అమ్మేసేలా ఉన్నదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ ఆగ్ర నాయకుడు తేజస్వియాదవ్ అన్నారు. బడ్జెట్ పూర్తిగా ముందుచూపులేనిదని, దీని ఉద్దేశం దేశాన్ని అమ్మేయడమేనని విమర్శించించారు టీఎంసీ ప్రతినిధి ఓబ్రెయిన్ అన్నారు. సాధారణ ప్రజలను, రైతులను విస్మరించారని..మధ్యతరగతివారికి ఏమి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.