విపక్షాలపై బీజేపీ ఎదురుదాడి…కాంగ్రెస్ 2019 మేనిఫెస్టోలో ఉంది అదేగా?

Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న విపక్షాలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.
గతంలో తాము ఏం చేశామో మర్చిపోయి… రాజకీయ ఉనికి కోసమే కేంద్రం చర్యల్ని ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ఆంక్షలు ఎత్తేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన విషయాన్ని మర్చిపోయారా? అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ ద్వంద వైఖరి బయటపడిందన్నారు.
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ప్రస్తుతం మోడీ సర్కార్ చేస్తున్న పనే కాంగ్రెస్ హయాంలో వాళ్లు చేశారని అన్నారు. రాజకీయ ఉనికి కోసం విపక్షాలు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా గతంలో తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యం కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతుల ఆందోళకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్ పై కూడా రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని.. కానీ ఇప్పుడు వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు.
మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాల్ని ‘అంబానీ-అదానీ చట్టాలు’గా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఇక కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తక్షణమే ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవాలని, లేదా బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
రైతుల హక్కులను హరించిన బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కులేదన్నారు మమతా బెనర్జీ. రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నూతన అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. సాగుచట్టాలను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు.
కాగా, ప్రైవేటు రంగం ప్రధాన పాత్ర పోషించేలా ఏపీఎంసీ చట్టాన్ని సవరించాలని రాష్ట్రాలకు అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ రాసిన లేఖలోని వివరాలను బీజేపీ బహిర్గతం చేయడాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) తప్పుబట్టింది. నిరసన చేస్తున్న రైతులను అయోమయానికి గురిచేసేందుకే శరద్ పవార్ లేఖలను బీజేపీ సర్కులేట్ చేస్తోందని ఎన్సీపీ విమర్శించింది. వ్యవసాయ శాఖ మంత్రిగా వాజ్పేయీ హయాంలో ప్రవేశపెట్టిన ఏపీఎంసీ చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్రాలను పవార్ ఒప్పించారని పేర్కొంది. కేంద్ర మంత్రిగా శరద్ పవార్ మార్పులు చేసిన ఏపీఎంసీ చట్టం వల్ల దేశంలోని రైతులు అనేక ప్రయోజనాలు పొందారని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపాసే పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రైతులకు అభద్రతాభావాన్ని, అనేక అనుమానాలను మిగిల్చిందని అన్నారు.