టచ్ లోనే ఉన్నారు : కంగారుపడొద్దన్న కుమారస్వామి

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ముంబైలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు అందుబాటులో లేరే తప్ప తనతో టచ్ లోనే ఉన్నారని, ప్రతి ఒక్కరితో తాను మాట్లాడుతూనే ఉన్నానని, త్వరలో వాళ్లు తిరిగి బెంగళూరుకి వస్తారని అన్నారు. తాను రిలాక్స్ ఉన్నాను, రిలాక్స్ గా ఉంటానని తెలిపారు. కంగారుపడకండి..సంతోషంగా ఉండండి అని సీఎం అన్నారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీ అగ్ర నేతలు బేరసారాలు జరిపారని, ఎవరెవరికి ఏమేం ఆఫర్ చేశారో తనకు అంతా తెలుసునని కుమారస్వామి అన్నారు.
మరోవైపు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవబోతుందంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంగళవారం ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో సంకీర్ణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తూ స్థిరమైన ప్రభుత్వం కోసం తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందంటూ సోమవారం మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. అదే రోజు మధ్యాహ్నాం అసలు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపేందుకు వీల్లేకుండా గురుగావ్ లోని ఓ హోటల్ కి బీజేపీ తమ 104మంది ఎమ్మెల్యేలను తరలించింది. హోటల్ దగ్గర సెక్యూరిటీ పెంచాలని బీజేపీ చీఫ్ అమిత్ షా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ని కోరిన విసయం తెలిసిందే. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ బయట బుధవారం హర్యానా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు.