భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

  • Published By: naveen ,Published On : July 26, 2020 / 10:27 AM IST
భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

Updated On : July 26, 2020 / 10:35 AM IST

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇక దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్యా ఆందోళనకు గురి చేస్తోంది. కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 700 మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే మరో 705 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 32వేల 63కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తమిళనాడులో 2లక్షలు దాటిన కరోనా కేసులు:
దేశంలో ఇప్పటివరకు వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో 8లక్షల 85వే 577 మంది కోలుకోగా మరో 4లక్షల 67వేల 882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 63శాతం ఉండగా మరణాల రేటు 2.35శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా మరణాల్లో 6వ స్థానంలో కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేటికి 125 రోజులు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక, ఏపీ, అసోం రాష్ట్రాల్లో చాలా వేగంగా కేసులు నమోదవుతున్నాయి.