24 గంటల్లో కొత్తగా 55వేలకు పైగా కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : August 18, 2020 / 10:13 AM IST
24 గంటల్లో కొత్తగా 55వేలకు పైగా కరోనా కేసులు

Updated On : August 18, 2020 / 12:18 PM IST

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 27 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడగా.. సుమారు 52 వేల మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 55,079 మందికి కొత్తగా కరోనా సోకగా.. 876 మంది మరణించారు.



ఇదే సమయంలో ఒక్క రోజులో అమెరికా మరియు బ్రెజిల్‌లో వరుసగా 40,612 మరియు 23,038 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 13వ తేదీన భారతదేశంలో రికార్డు స్థాయిలో 66,999 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా లెక్కల ప్రకారం, ఇప్పటివరకు దేశంలో 27 లక్షల 2 వేల 742 మందికి కరోనా సోకింది. వీరిలో 51,797 మంది చనిపోయారు. క్రియాశీల కేసుల విషయానికి వస్తే 6 లక్షల 73వేలకు పడిపోయింది. ఇప్పటివరకు దేశంలో 19 లక్షల 77 వేల మంది కోలుకున్నారు.



దేశంలో మరణాల రేటు, క్రియాశీల కేసుల రేటు తగ్గడం ఉపశమనం కలిగించే విషయం. మరణాల రేటు 1.91 శాతానికి పడిపోగా.. చికిత్స పొందుతున్న క్రియాశీల కేసుల రేటు కూడా 24.90% కి పడిపోయింది. దేశంలో రికవరీ రేటు 73.17శాతంగా ఉంది.

దేశంలో రోజుకు ఏడు లక్షలకు పైగా నమూనాలను పరీక్షిస్తున్నారు, కరోనా వైరస్ పరీక్ష సామర్థ్యాన్ని పెంచుతూ.. ఇప్పటివరకు 3 కోట్లకు పైగా నమూనాలను దేశవ్యాప్తంగా పరీక్షించారు. గత కొన్ని రోజులుగా భారతదేశంలో రోజుకు పరీక్షల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఏడు లక్షలకు పైగా నమూనాలను ప్రతిరోజూ పరీక్షిస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో మహారాష్ట్రలో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆసుపత్రులలో 1.5 లక్షలకు పైగా సోకిన ప్రజలు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో, కర్ణాటక నాలుగవ స్థానంలో, ఢిల్లీ ఐదవ స్థానంలో ఉంది.