ఆందోళనలు ఆపొద్దు…అండగా ఉంటా : మమత

  • Published By: venkaiahnaidu ,Published On : December 26, 2019 / 03:40 PM IST
ఆందోళనలు ఆపొద్దు…అండగా ఉంటా : మమత

Updated On : December 26, 2019 / 3:40 PM IST

పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని ర్యాలీ సందర్భంగా మమత విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు విద్యార్థులందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు కొనసాగించాలన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని,నేు మీకు అండగా ఉంటాను అని విద్యార్ధులతో మమత అన్నారు. సీఏఏ ఉపసంహరించుకునేంతవరకు ఆందోళనలు ఆపవద్దని మమత సూచించారు. ఈ సందర్భంగా బీజేపీకి మమత వార్నింగ్ ఇచ్చారు. నిప్పుతో బీజేపీ ఆడుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చడంలేదన్నారు.

మంగళూరులో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరికి పరిహారం ఇస్తామని ముందు చెప్పి,ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించడాన్ని ఈ సందర్భంగా మమత తప్పుబట్టారు.
సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేప్తున్న జామియా మిలియా,ఐఐటీ కాన్పూర్ సహా పలు యూనివర్శిటీల్లోని విద్యార్ధులకు మమత ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటించారు.

అయితే రెండు రోజుల క్రితం మమత సర్కార్ కు కౌంటర్ ఇస్తూ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కోల్ కతాలో బీజేపీ మెగా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. త్వరలో బెంగాల్ కు 30వేల మంది వాలంటీర్లను పంపి వారి ద్వారా సీఏఏ గురించి ప్రజలకు వివరించాలని బీజేపీ ఇప్పటికే ఫ్లాన్ చేసింది. జనవరి చివరినాటికి ఈ ఫ్లాన్ ఆచరణలో పెట్టాలని బీజేపీ కసరత్తులు చేస్తోంది.