కాంగ్రెస్ పథకంపై సెటైర్లు..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు ఈసీ నోటీసు

ఎన్నికల హామీల్లో భాగంగా సోమవారం(మార్చి-26,2019) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రశ్నించిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ హామీపై ప్రశ్నలు లేవనెత్తిన రాజీవ్ కుమారు కు ఈసీ నోటీసు పంపింది.రెండు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాజీవ్ కుమార్ ‘బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్’గా ఉన్నందున పార్టీల ఎన్నికల ప్రచారంపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 25కోట్ల మంది నిరుపేదలకు ఏడాదికి రూ.72,000 వారి అకౌంట్లలో జమచేస్తామని, ఇందువల్ల దేశ ప్రజల్లో 20 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని రాహుల్ గాంధీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.దీనిపై రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రుడ్ని తెచ్చిస్తామంటోంది. ‘ఎకనామిక్స్ పరీక్ష, ఆర్థిక క్రమశిక్షణా పరీక్ష, అమలు పరీక్షకు ప్రతిపాదిత కనీసం ఆదాయం పథకం నిలబడదు’ అని ఆయన అన్నారు.
రాజీవ్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాజీవ్ కుమార్ తన పనిని బీజేపీ కార్యాలయం నుంచే చేసుకుంటే బాగుంటుందని, నేరుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం మంచిదని విమర్శించింది.