బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. జేఎన్.1 వేరియంట్ లక్షణాలు ఇవే.. వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి..

దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. జేఎన్.1 వేరియంట్ లక్షణాలు ఇవే.. వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి..

JN1 variant

Updated On : May 25, 2025 / 2:19 PM IST

COVID-19: దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వైరస్ను జేఎన్.1 వేరియంట్గా గుర్తించారు. ప్రజలు భయాందోళన చెందుతున్న వేళ శనివారం బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదైందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలో ఇప్పటి వరకు 35 యాక్టివ్ కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 32 బెంగళూరులో నమోదయ్యాయని పేర్కొంది.

 

దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తిపై కేంద్ర వైద్య శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. దేశంలో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆకోగ్యశాఖ గుర్తించింది.

బెంగళూరులో తొమ్మిది నెలల వయసు కలిగిన ఓ శిశువుకు కొవిడ్ -19 నిర్దారణ అయింది. మే 22న రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించామని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

 

గత 20రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు చెప్పారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచించారు. తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్య లక్షణాలు ఉంటే సకాలంలో చికిత్స తీసుకోవాలని, అదే సమయంలో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

జేఎన్.1 వేరియంట్ లక్షణాలు:
* జ్వరం
* ముక్కు కారటం
* గొంతు నొప్పి
* తలనొప్పి
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* ఆకలి లేకపోవడం
* వికారం, విపరీతమైన అలసట
* జీర్ణాశయాంతర సమస్యలు
* సాధారణంగా కనిపించే ఈ లక్షణాల నుంచి కోలుకునేందుకు 5 రోజులు పట్టొచ్చని వైద్యులు తెలిపారు.