మరో కథువా ఘటన : గిరిజన బాలికపై అమానుషం

మరో కథువా ఘటనతో దేశంలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. కశ్మీర్ లోని బకర్వాల్ తెగకు చెందిన బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చంపేస్తారనే భయంతో ఈ దారుణాన్ని దాచిపెట్టిన ఆ బాలిక.. తాను మూడు నెలల గర్భవతి అని తెలియడంతో అసలు విషయం బయటపడింది. బాలిక ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందనే ఉద్ధేశంతో చిన్నారికి అబార్షన్ చేయించారు తల్లిదండ్రులు.
బాలికపైలైంగికదాడి ఘటనపై రామ్‌షూలో నిరసనలు వెల్లువెత్తాయి. జమ్ము నుంచి ముస్లింలను తరిమివేస్తున్నారనీ..అందుకే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనీ విమర్శలు వస్తున్నాయి. పశువులను మేపుతుండగా..ఐదుగురు బలవంతంగా ఎత్తుకుపోయారనీ..బ్రతిమిలాడినా..దణ్ణం పెట్టినా విడిచిపెట్టకుండా దారుణంగా కొట్టి లైంగికదాడికి పాల్పడినట్లుగా బాలిక తెలిపింది. బైటకు చెబితే దారుణంగా చంపేస్తామని బెదిరించారని చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జనవరి 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాంబన్ ఎస్పీ అనితా శర్మ తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుపై స్పెషల్ పోలీస్ టీమ్ ను ఏర్పాటు చేశామని ఎస్పీ అనితా శర్మ తెలిపారు.
2018లో జరిగిన కథువా హత్యాచార ఘటనను మరువక ముందే మరో ఘటన జరగడంతో బకర్వాల్ తెగ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కశ్మీర్‌లోని కథువా జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి వారంరోజులపాటు ఘోర అత్యాచారానికి పాల్పడిన తరువాత ఆ చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఘటన 2018లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.