రాజకీయం షేక్ చేసి…షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న పైలట్,గహ్లోత్

కరోనా విజృంభణలోనూ రాజకీయంగా వేడి పుట్టించిన రాజస్థాన్ రాజకీయాలు ఎట్టకేలకు చల్లారాయి. తిరుగుబాట్లు.. కోర్టు మెట్లు.. కొనుగోళ్లు.. రిసార్టులు అంటూ సాగిన పొలిటికల్ డ్రామా అసెంబ్లీకి ఒక్కరోజు క్లైమాక్స్‌కు చేరింది. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్ ఇద్దరూ ఇవాళ(ఆగస్టు-13,2020) చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించారు.
సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అయింది. సచిన్‌ను వెనక్కి రప్పించడంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సైతం వీరితోపాటు ఉన్నారు. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసింది.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని మర్చిపోయి, మన్నించి, రాష్ట్రం, దేశం, ప్రజల కోసం ముందుకెళ్దాం అని సీఎం గహ్లోత్ ఈ ఉదయం ట్వీట్ చేశారు. అందుకు అనుగుణంగానే సీఎల్పీ భేటీకి హాజరైన యువనేతను సాదరంగా ఆహ్వానించడంతో పాటు, చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేశారు గహ్లోత్.
సీఎం అశోక్ గహ్లోత్‌కు మరో ఊరట లభించింది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల విలీన అంశంపై ప్రస్తుతం తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న రాజస్థాన్ హైకోర్టుకే ఆ నిర్ణయాన్ని వదిలేసింది. ఈ మేరకు అత్యవసర విచారణ చేపట్టాలన్న భాజపా అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే గహ్లోత్ తరఫున వీరు ఓటు వేయనున్నారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఆ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.