ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ ముకుంద్‌ నరవణే

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 07:29 AM IST
ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ ముకుంద్‌ నరవణే

Updated On : December 31, 2019 / 7:29 AM IST

భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మంగళవారం  డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ రావత్‌ స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ నరవణే బాధ్యతలు స్వీకరించారు. భారత  ఆర్మీకి నరవణే  28వ సైన్యాధిపతి. జనరల్ మనోజ్ ముకుంద్…తన 37 సంవత్సరాల సర్వీసులో వివిధ బాధ్యతలను నిర్వహించారు. శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా మనోజ్ ముకుంద్ ఒకడిగాపనిచేశారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ నరవణే.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. పుణెలోని జనన ప్రబోధిని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో పూర్తి చేశారు. డిఫెన్స్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీని చెన్నైలోని మద్రాస్‌ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండోర్‌లోని దేవీ అహిల్య విశ్వవిద్యాలయంలో డిఫెన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంఫిల్‌ చేశారు.

1980లో తొలిసారిగా సిఖ్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ ఏడో బెటాలియన్‌లో నియామకం అయ్యారు నరవణే. జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్‌లో కమాండెంట్ గా, అసోం రైఫిల్స్‌లో ఇన్‌స్పెక్టర్‌గా జనరల్‌గా నరవణే సేవలందించారు. చైనాతో 4000 కిలోమీటర్ల సరిహద్దు గల ప్రాంతాన్ని రక్షించే ఈస్టెర్న్ కమాండ్ అధిపతిగా, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లోనూ, మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2019, సెప్టెంబర్‌ ఒకటో తేదీన ఆర్మీ వైస్‌ ఛీఫ్‌గా నరవణే నియామకం అయ్యారు. ఆయన అందించిన సేవలకు గాను విశిష్ట్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్‌లు నారావణేను వరించాయి. ఆయన భార్య వీణా నరవణే టీచర్‌‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.