ఇద్దరు పిల్లల చట్టం: వారికి ప్రభుత్వ పథకాల్లేవ్!

  • Published By: vamsi ,Published On : March 6, 2020 / 05:04 AM IST
ఇద్దరు పిల్లల చట్టం: వారికి ప్రభుత్వ పథకాల్లేవ్!

Updated On : March 6, 2020 / 5:04 AM IST

భారతదేశంలో ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువ. అయితే లేటెస్ట్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వారికి సంక్షేమ పథకాలను ఆపివెయ్యాలని యోచిస్తుందట ప్రభుత్వం.

ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న జనాభాను నియంత్రించే ప్రయత్నంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న ప్రజలను రాష్ట్ర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందటానికి అనుమతించకుండా నిబంధనలు తీసుకుని రాబోతుంది. అలాగే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిబంధన తీసుకుని వచ్చే ప్లాన్ చేస్తుంది. 

ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల జనాభా విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మంచిది అనే విషయాలను ఓ మంత్రివర్గ కమిటీ వేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. 

జనాభా లెక్కల ముసాయిదాను నిపుణుల కమిటీ సమీక్షిస్తోండగా.. చివరిసారిగా 2000లో దీనిని సవరించారు. నిపుణుల కమిటీలో భాగమైన రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బద్రి విశాల్ మాట్లాడుతూ.. దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభాను నియంత్రించగలిగాయి కానీ, ఉత్తర రాష్ట్రాలు మాత్రం ఇంకా ఈ విషయంలో కష్టపడుతున్నాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రాలు అయినా కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు లేకుండా చూసుకునేందుకు పథకాలను రూపొందించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో, రెండు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద వచ్చే ప్రయోజనాలను నిలిపివేయడం వంటి ఆలోచనలు అందులో ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉన్నవారి విషయంలో ఈ నిబంధన లేకుండా రాబోయే కాలంలో ఈ నిబంధన అమలు చెయ్యాలని ఓ ఆలోచన.

ఇటీవల ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కూడా భారతదేశంలో ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలయ్యేలా చేయడమే ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు ప్రణాళిక అని ప్రకటించగా.. ఇప్పుడు ఈ నిర్ణయంపై దేశమంతా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

See Also | కాపులుప్పాడ కొండపై ఏపీ సచివాలయం